మధురై బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
అగు జైలు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ బాణసంచా తయారీ కర్మాగారంలో కార్మికులు రోజూవారీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు
తమిళనాడులోని మధురైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ క్రాకర్స్ తయారీ కేంద్రంలో భారీ శబ్దంతో పేలుళ్లు జరిగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న మదురై, తిరుమంగళం అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
అగు జైలు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ బాణసంచా తయారీ కర్మాగారంలో కార్మికులు రోజూవారీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 15 మందికి పైగా కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఊహించని ప్రమాదం జరిగి.. మంటలు చెలరేగడంతో భవనం కుప్పకూలింది. సమాచారం తెలుసుకున్న మదురై, తిరుమంగళం ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా ప్రాంతాల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. శరీర భాగాలు కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టతరమవుతోందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో బాధితులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.