వివాహానికి ముందు గుండెపోటుతో వధువు మృతి.. పెళ్లి మాత్రం ఆగలేదు
భావ్‌నగర్ జిల్లా సుభాష్ నగర్‌కు చెందిన జినాభాయ్ రాథోడ్ పెద్దకుమార్తె హేతల్‌కు.. నారీ గ్రామానికి చెందిన విశాల్‌భాయ్‌తో
ఇటీవల కాలంలో పెళ్లి పీటలపై, పెళ్లికి ముందు కొందరు యువతీ, యువకులు గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే గుజరాత్ లో జరిగింది. వివాహంతో కళకళలాడాల్సిన ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నిగంటల్లో ఓ ఇంటి కోడలు అవ్వాల్సిన వధువు.. గుండెపోటుతో కన్నుమూసింది. అయినా అక్కడ జరగాల్సిన వివాహం ఆగలేదు. కొండంత బాధను పంటికింద అదిమిపెట్టుకుని.. ఆమె చెల్లెలితో వివాహం జరిపించారు.
భావ్‌నగర్ జిల్లా సుభాష్ నగర్‌కు చెందిన జినాభాయ్ రాథోడ్ పెద్దకుమార్తె హేతల్‌కు.. నారీ గ్రామానికి చెందిన విశాల్‌భాయ్‌తో పెళ్లి నిశ్చయమైంది. గురువారం వివాహం జరగాల్సి ఉండగా వరుడు ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలోనే హేతల్ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే కుటుంబీకులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ పెళ్లి ఆగకూడదని భావించిన వధువు కుటుంబీకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హేతల్ స్థానంలో ఆమె చెల్లిలిని ఇచ్చి పెళ్లి జరిపించేందుకు ముందుకొచ్చారు. అందుకు విశాల్ కూడా అంగీకరించాడు. దీంతో హేతల్ మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచి వచ్చి వివాహం జరిపించారు.