పట్టపగలే రెచ్చిపోయిన వేటగాళ్లు.. 12 జింకలు మృతి
ఆదోని మండలం నారాయణపురం పొలాల్లోని గోర్జి వంక సమీపంలో ఆదివారం ఉదయం జరిగిందీ ఘటన. వేటగాళ్లు జింకల మాంసాన్ని..;
కర్నూల్ : పట్టపగలే వేటగాళ్లు రెచ్చిపోయారు. తుపాకులతో మూగజీవాలను వెంటాడి, వేటాడటంతో 12 జింకలు మృతి చెందాయి. ఈ ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా నారాయణపురం గ్రామ పొలాల్లో జరిగింది. వేటగాళ్లు, దుండగులు జీప్ లో వచ్చి తమ వెంట తెచ్చుకున్న తుపాకులతో జింకల మందపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 జింకలు ప్రాణాలు కోల్పోయాయి. తమ వేటలో 12 జింకలు చనిపోవడంతో ఇంకేముంది.. పంట పండింది అనుకున్నారు. చనిపోయిన జింకలను తమవెంట తీసుకొచ్చి.. కత్తులతో వాటి తలలు - మొండాలను వేరు చేసి, మాంసంతో అక్కడి నుంచి ఉడాయించారు.
Also Read : కూలిన బొగ్గు గని .. 14 మంది బలి
ఆదోని మండలం నారాయణపురం పొలాల్లోని గోర్జి వంక సమీపంలో ఆదివారం ఉదయం జరిగిందీ ఘటన. వేటగాళ్లు జింకల మాంసాన్ని తీసుకెళ్లడం చూసిన గ్రామస్తులు.. పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది సంఘటన ప్రాంతానికి వెళ్లి జింకల తలలను స్వాధీనం చేసుకున్నారు. పట్టపగలే జింకలను వేటాడిన ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, వ్యవసాయ కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతో కర్నూలు జిల్లాలో వన్యప్రాణులకు రక్షణ కరవైంది అని స్థానికులు ఆరోపిస్తున్నారు.