మరో ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి బలవన్మరణం.. వారంలో ఇద్దరు
వారంరోజుల వ్యవధిలో ఐఐటీ హైదరాబాద్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
ఐఐటీ హైదరాబాద్ కు చెందిన మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంగారెడ్డిలోని ఓ లాడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ కు చెందిన మేఘా కపూర్ గా గుర్తించారు పోలీసులు. మేఘా కపూర్ మూడు నెలల క్రితమే ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్ లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాతి నుంచి సంగారెడ్డిలో ఉన్న ఆధ్యా లాడ్జిలో ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. కాగా.. మేఘా కపూర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
ఇదిలా ఉండగా.. వారంరోజుల వ్యవధిలో ఐఐటీ హైదరాబాద్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఐఐటీలో ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆగస్ట్ 31న బలవన్మరణానికి పాల్పడ్డాడు. హాస్టల్ లో తన గదిలో రాహుల్ నైలాన్ తాడుతో ఉరివేసుకున్నాడు. 2019 నుంచి ఐఐటీ హైదరాబాద్ కు చెందిన ఆరుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం గమనార్హం. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వారు చదువు ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారా ? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.