చికెన్ కబాబ్ రుచిగా లేదని వంటమనిషి హత్య
నసీర్ తన యజమానికి ఆదేశాల మేరకు వారివద్దకు వెళ్లి కొనుగోలు చేసిన కబాబ్ కు బిల్లు చెల్లించాలని కోరాడు.
నిన్న హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఓ చికెన్ పకోడి సెంటర్ యజమాని.. పకోడిలో కారం ఎక్కువైందని అడిగిన కస్టమర్ పై కత్తితో దాడిచేసిన విషయం తెలిసిందే. అది జరిగి ఇంకా 24 గంటలైనా కాకుండానే.. ఉత్తరప్రదేశ్ లో చికెన్ కబాబ్ కోసం ఓ వ్యక్తిని కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. బుధవారం (మే3)న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బరేలీలోని ప్రేమ్ నగర్ లో ఓ దుకాణానికి మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారు అక్కడ కబాబ్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత అది రుచిగా లేదంటూ.. షాపుయజమాని అంకుర్ సబర్వాల్ తో గొడవకు దిగారు.
గొడవ చేసి.. బిల్లు చెల్లించకుండా వెళ్లిపోతుండగా.. వారివద్ద నుండి డబ్బులు అడిగి తీసుకురావాలంటూ అంకుర్ తన వంటమనిషి అయిన నసీర్ అహ్మద్ ను పంపాడు. నసీర్ తన యజమానికి ఆదేశాల మేరకు వారివద్దకు వెళ్లి కొనుగోలు చేసిన కబాబ్ కు బిల్లు చెల్లించాలని కోరాడు. వారిద్దరిలో ఒకడైన మయాంక్ రస్తోగి అనే వ్యక్తి మమ్మల్నే డబ్బులు అడుగుతావా అంటూ.. తనవద్దనున్న లైసెన్స్ డ్ తుపాకీతో నసీర్ తలపై కాల్చి చంపేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని నసీర్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడైన మయాంక్ తన తండ్రి లైసెన్స్ తుపాకీని వినియోగించాడని, అతని తండ్రి కూడా గతంలో నిందితుడేనని తెలిపారు. కాగా మృతుడు నసీర్ కు భార్య, 10 సంవత్సరాల కుమార్తె ఉన్నారు.