ఢిల్లీలో కాల్పుల కలకలం.. నడిరోడ్డుపై హత్యాయత్నం
సుభాష్ నగర్లోని సీసీ ఫుటేజ్ లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ..;
దేశ రాజధాని ఢిల్లీ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. అత్యంత రద్దీ ప్రాంతంలో నడిరోడ్డపై కారులో ఉన్న వ్యక్తులపై హత్యాయత్నం జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్లో జరిగిందీ ఘటన. దుండగులు ఓ కారులో ఉన్న వ్యక్తులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. 10 రౌండ్లు కాల్పులు జరపడంతో.. ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు.. భారీగా బలగాలను మోహరించారు.
సుభాష్ నగర్లోని సీసీ ఫుటేజ్ లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సుభాష్ నగర్ ప్రాంతంలో దుండగులు ఓ కారులో ఉన్న వ్యక్తులపై 10 రౌండ్లు కాల్పులు జరుపగా.. ఇద్దరు గాయపడ్డారు. కాల్పుల మోతతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో భద్రతను పెంచినట్లు ఉన్నతాధికారి చెప్పారు. కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ హింసాకాండలో పోలీసులతో పాటు పలువురికి గాయాలయ్యాయి. కాగా.. గత నెల 16న నార్త్ వెస్ట్ ఢిల్లీలోని జహంగీర్ పురిలో జరిగిన ఘర్షణలు తర్వాత.. ఇప్పుడు మళ్లీ కాల్పులు జరగడంతో స్థానికంగా కలకలం రేగింది.