మొబైల్ దొంగతనాల రాకెట్ ను పట్టుకున్న పోలీసులు.. మొత్తం ఎన్ని దొరికాయంటే..!
మొబైల్ దొంగతనాల రాకెట్ ను పట్టుకున్న పోలీసులు.. మొత్తం ఎన్ని
ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్ VI శనివారం అంతర్ రాష్ట్ర మొబైల్ దొంగతనాల రాకెట్‌ను ఛేదించింది. ముఠాలోని ఇద్దరు సభ్యులను అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి మొత్తం 490 స్మార్ట్‌ఫోన్లు, ఫోన్‌లను రిపేర్ చేయడానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 9.5 కిలోల గంజాయి, 174 మద్యం సీసాలు, రెండు కత్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ రూ.74.78 లక్షలు. ఈ ముఠా నగరంలోని స్నాచర్లు, దొంగల నుంచి దొంగిలించిన స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేవారు.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహబూబ్ ఖాన్ (37) దొంగిలించిన ఫోన్‌లను డీల్ చేస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. సమాచారం మేరకు ఒక బృందంగా ఏర్పడి మన్‌ఖుర్డ్‌లోని మహారాష్ట్ర నగర్‌లోని మెహబూబ్ ఖాన్ ఇంటిపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. IMEI నంబర్‌ను మార్చడంలో, దొంగిలించబడిన ఫోన్‌లను తిరిగి ఆపరేట్ చేయడంలో సహాయపడిన ఫయాజ్ షేక్ అనే 31 సంవత్సరాల వ్యక్తి కూడా అరెస్టయ్యాడు.
దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను సేకరించడం లేదా కొనుగోలు చేయడం, అతని సహచరుడి సహాయంతో వాటి IMEI నంబర్‌లను మారుస్తూ ఉండేవాడు మెహబూబ్ ఖాన్. ఫోన్‌ల IMEI నంబర్‌లను మార్చిన తర్వాత వాటిని అమ్మేసేవారు. "నిందితుడు దొంగిలించబడిన విలువైన వస్తువులను ఉంచడానికి తన నివాసం పక్కనే మరొక గదిని అద్దెకు తీసుకున్నాడు. ఈ నేరంలో ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉన్నారనే విషయంపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నాం. ఎన్‌డిపిఎస్ చట్టం, మహారాష్ట్ర నిషేధ చట్టంలోని దొంగతనం, మోసం మరియు ఇతర సెక్షన్‌లతో పాటు నేరపూరిత కుట్రకు కూడా వారిపై కేసులు నమోదు చేశాం" అని క్రైమ్ బ్రాంచ్ యూనిట్ యాక్టింగ్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర సలుఖే తెలిపారు.