నాలుగు రోజుల శిశువుని తొక్కిచంపిన పోలీసులు ?
వివరాల్లోకి వెళ్తే.. డియోరి పోలీస్ స్టేషన్ పరిధిలో భూషన్ పాండే అనే వృద్ధుడిపై ఒక కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్
నాలుగు రోజుల శిశువుని పోలీసులు తొక్కి చంపారని ఆరోపించారు శిశువు కుటుంబ సభ్యులు. ఈ ఘటన ఝార్ఖండ్, గిరిదిహ్ జిల్లాలోని కోసోగోండోడిఘి గ్రామంలో బుధవారం జరుగగా.. దానిపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. డియోరి పోలీస్ స్టేషన్ పరిధిలో భూషన్ పాండే అనే వృద్ధుడిపై ఒక కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అతడికి పట్టుకునేందుకు సంగం పాఠక్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుని ఇంటికి వెళ్లారు. వారి రాకను గమనించిన నిందితుడి కుటుంబసభ్యులంతా ఇంట్లో నుంచి పారిపోయారు. నాలుగు రోజుల శిశువు నిద్రపోతుండటంతో ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయారు.
నిందితుడి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. ఇల్లంతా సోదాలు చేసి వెళ్లిపోయారు. అనంతరం కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి చేరుకున్నారు. వెళ్లి చూస్తే.. నిద్రపోతున్న నాలుగు రోజుల చిన్నారి.. మరణించి ఉంది. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే చిన్నారిని కాలితో తొక్కి చంపారని ఆరోపిస్తూ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న డీఎస్పీ సంజయ్ రాణా పోస్టుమార్టమ్ రిపోర్టు ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా విచారణకు ఆదేశించారు.