యూపీ రోడ్డుప్రమాదం : మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా
మృతులు సరస్వతి ప్రసాద్ వర్మ (94), కౌశల్ కిషోర్ (58), అజీమున్ (55), సగీర్ (45), సురేంద్ర కుమార్ చౌరాసియా (35)..
ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. లఖింపూర్ ఖేరీ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేట్ బస్సు మినీ ట్రక్కును ఢీ కొట్టడంతో 10 మంది మృతి చెందగా.. 41 మంది గాయపడ్డారు. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాతీయ రహదారి 730పై గల ఐరా వంతెనపై జరిగిందని డీఎస్పీ ప్రీతమ్ పాల్ సింగ్ తెలిపారు. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని, వారిని లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించామని, 29 మంది జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని లఖింపూర్ ఖేరీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) తెలిపారు.
మృతులు సరస్వతి ప్రసాద్ వర్మ (94), కౌశల్ కిషోర్ (58), అజీమున్ (55), సగీర్ (45), సురేంద్ర కుమార్ చౌరాసియా (35), జితేంద్ర (25), మున్ను మిశ్రా (16) లక్నోకు చెందిన వారిగా.. ఆర్య నిగమ్ (8), అందరూ ధౌరహ్రా తహసీల్ నివాసితులుగా గుర్తించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.50,000 ఆర్థిక సహాయం అందజేయనున్నారు.