యాత్రికులతో వెళ్తోన్న బస్సుకు ప్రమాదం.. 20 మంది సజీవదహనం
దేశంలోని నైరుతి ప్రాంతంలో అసిర్ ప్రావిన్సు - అభానగరాన్ని కలిపే రహదారిపై ఈ ఘటన జరిగింది. హజ్ యాత్రికులతో..
యాత్రికులతో వెళ్తోన్న ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో మంటలు చెలరేగగా.. 20 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. ఈ దారుణ ఘటన సౌదీ అరేబియాలో జరిగింది. దేశంలోని నైరుతి ప్రాంతంలో అసిర్ ప్రావిన్సు - అభానగరాన్ని కలిపే రహదారిపై ఈ ఘటన జరిగింది. హజ్ యాత్రికులతో వెళ్తోన్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిని ఢీ కొట్టి బోల్తా పడింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగగా.. వాటి నుంచి బస్సులో ఉన్నవారు తప్పించుకోలేక పోయారు. 20 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతవ్వగా.. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రంజాన్ నెలలో మక్కాకు వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే వీరంతా కూడా మక్కాకు బయల్దేరగా మార్గమధ్యంలో ఈ దారుణం జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. కాగా.. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రయాణికులు ఉమ్రా కోసం మక్కా మసీదుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.