భారీ పేలుడు.. 14 మంది పరిస్థితి విషమం
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతి ఘన్ పూర్ గ్రామ శివారు లో ఉన్న ఒక పెయింట్ కంపెనీలో
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతి ఘన్ పూర్ గ్రామ శివారు లో ఉన్న ఒక పెయింట్ కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. 14మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. గాయపడిన వారిని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.
షాద్‌నగర్ సమీపంలోని శ్రీనాథ్ రోటో ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైపర్స్, పెయింట్స్ తయారీతో పాటు పలు రకాల విభాగాలు ఉన్నాయి. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పెయింట్ విభాగంలో రంగులు తయారుచేసే యంత్రం ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగాయి దీంతో అక్కడ పనిచేస్తున్న 14 మందికి నిప్పు అంటుకున్నది. అప్రమత్తమైన తోటి కార్మికులు మంటలను ఆర్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను షాద్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. వారిలో 11 మంది శరీరాలు 50 శాతానికిపైగా కాలిపోయాయి. మెరుగైన చికిత్స వారిని హైదరాబాద్ కు తరలించారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 50 మందికిపైగా కార్మికులు ఉన్నారని తెలుస్తోంది. బాధితులంతా ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారే..! హైదరాబాద్ కు ఉపాధి కోసం వలస వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.