జీతం రాలేదని.. తెలంగాణ హోంగార్డు తీసుకున్న నిర్ణయం

జీతం మీదే ఆధారపడి బ్రతికే వాళ్లు ఎంతో మంది ఉంటారు. సమయానికి జీతం;

Update: 2023-09-06 02:02 GMT

హోంగార్డ్ ఇన్ హైదరాబాద్, శాలరీ డిలే.

జీతం మీదే ఆధారపడి బ్రతికే వాళ్లు ఎంతో మంది ఉంటారు. సమయానికి జీతం వస్తుంది.. దానికి తగ్గట్టుగా ఖర్చులు పెట్టుకుందాం.. అప్పులు ఇచ్చేద్దాం.. ఈఎంఐలు కట్టేసుకుందాం అని అనుకుంటూ ఉంటారు. కానీ అనుకున్న సమయానికి జీతం పడకపోతే ఎంతో టెన్షన్ పడిపోతూ ఉంటారు. అప్పులు చేయడానికి మనసు ఒప్పక.. కొన్ని కొన్నిసార్లు ఊహించని నిర్ణయం తీసుకుంటూ ఉంటారు.

హోంగార్డు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. వేతనం చెల్లింపులో జాప్యానికి నిరసనగా కమాండెంట్‌ కార్యాలయంలోనే నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. షాయినాయత్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన ఎం.రవీందర్‌(38) చాంద్రాయణ గుట్ట ట్రాఫిక్‌ ఠాణాలో హోంగార్డుగా పని చేస్తున్నారు.ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రవీందర్‌ బ్యాంకుకు చెల్లించాల్సిన రుణానికి సంబంధించిన ఈఎంఐ చెల్లింపుకు ప్రతి నెల 5వ తేదీన గడువు పెట్టుకున్నారు. ఈ నెల ఇంకా జీతం రాక పోవడంతో కారణం తెలుసుకోవడానికి గోషామహల్‌లోని హోంగార్డు కమాండెంట్‌ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగులు హోంగార్డులకు చెల్లింపులకు సంబంధించిన చెక్కులు బ్యాంకులకు పంపించామని అవి ఒకట్రెండు రోజుల్లో ‌ఖాతాలకు జమ అవుతాయని చెప్పారు. బ్యాంకు చెల్లింపులు ఆలస్యం అయితే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందనే ఆవేదనతో కార్యాలయం బయటకు వెళ్లి తన వెంట బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో ఉలిక్కిపడ్డ సిబ్బంది వెంటనే మంటలార్పారు. అప్పటికే రవీందర్‌కు 50శాతం పైగా శరీరంపై కాలిన గాయాలయ్యాయి. ఏసీపీ వెంకట్‌రెడ్డి, సీఐ రవీందర్‌, ఎస్సై లక్ష్మయ్య ఆధ్వర్యంలో అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


Tags:    

Similar News