కేరళలో రోడ్డు ప్రమాదం.. స్వామి దర్శనార్థం వెళ్లి అనంతలోకాలకు

కేరళలో ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతిచెందారు. మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి.

Update: 2021-12-09 13:04 GMT

అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమల వెళ్తుండగా అపశృతి జరిగింది. పేరువంతానికి సమీపంలో అయ్యప్పస్వాములు వెళ్తున్న వాహనం బోల్తా పడటంతో ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతిచెందారు. మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు కర్నూలు కు చెందినవారుగా గుర్తించారు.

టీ తాగుతుండగా...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ నగరంలోని బుధవారపేటకు చెందిన 11 మంది అయ్యప్ప భక్తులు బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఒక టెంపోలో శబరిమలకు బయల్దేరారు. గురువారం ఉదయం 9.30 గంటలకు శబరిమలకు 60 కిలోమీటర్ల దూరంలో పేరువంతానికి సమీపంలో టెంపోను ఆపి టీ తాగుతుండగా.. వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు టెంపోను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు భక్తులు అక్కడే మృతి చెందగా.. మిగిలిన 9 మంది భక్తులకు తీవ్రగాయాలయ్యాయి.
కర్నూలులో విషాద చాయలు...
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని కేరళ పోలీసులు కర్నూలు పోలీసులకు తెలియజేయడంతో ప్రమాద ఘటన వెలుగులోకి వచ్చింది. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వెళ్లి.. అటునుంచి అటే అనంతలోకాలకు వెళ్లిన ఇద్దరి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు.


Tags:    

Similar News