పెట్రోల్ పోసుకొని ఉజ్జయిని మహంకాళి దేవాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

రెండు నెలల నుంచి జీతాలు రావడం లేదని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ఉద్యోగి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.

Update: 2022-07-22 15:08 GMT

రెండు నెలల నుంచి జీతాలు రావడం లేదని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ఉద్యోగి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. బోయిగూడ కు చెందిన వెంకటేష్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా రూ .10,500 వేతనంతో పనిచేస్తున్నారు. వెంకటేష్ తో పాటు మరో 9 మంది తాత్కాలిక ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తూ.. మే 8 వ తేదీన కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ ఫైల్ ప్రాసెస్‌లో ఉండడంతో.. మే, జూన్ నెలకు సంబంధించిన జీతాలు ఇంకా రాలేదు. వెంకటేష్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన శుక్రవారం ఉదయం దేవాలయం వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నిస్తుండగా స్థానికులు కాపాడారు. వెంటనే మహంకాళి పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని పోలీస్ స్టేషన్ తరలించారు.

గత మూడు నెలలుగా జీతం రావట్లేదంటూ వెంకటేష్ ఆలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. వెంటనే మహంకాళి పోలీసులు అతడిని వారించి అదుపులోకి తీసుకున్నారు. తనకు జీతం రాకుండా ఆలయ ఈఓ అడ్డుకుంటున్నాడని వెంకటేష్ ఆరోపించాడు. అయితే వెంకటేష్‌కు ఇటీవలే పర్మినెంట్ అవ్వడంతో జీతం ఆలస్యమయ్యిందని ఈవో చెప్పుకొచ్చారు. కమిషనర్ కార్యాలయం నుంచి రావాలని, రెండు రోజుల్లో జీతం వస్తుందన్నారు.

ఈవో మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. వెంకటేష్ కు రెండు నెలల జీతం రావాల్సింది నిజమే. ట్రెజరీ నుంచి వారికి జీతాలు అందాల్సి ఉందని అన్నారు. బోనాల సందర్భంగా కమిషనర్ దేవాలయానికి రాగా ఉద్యోగులు కలిసి సమస్య వివరించగా వెంటనే ఆయన స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. త్వరలోనే ఈ సమస్య తీరిపోతుందని ఉద్యోగులకు హామీ ఇచ్చినట్లు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం లో ఉద్యోగిగా పనిచేస్తున్న వెంకటేష్ ఆత్మహత్యాయత్నానికి పై అధికారులు, స్థానిక అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు.


Tags:    

Similar News