కుళ్లిన స్థితిలో యువకుడి మృతదేహం..హత్యా? ఆత్మహత్యా?
ఈ విషయం తెలిసి తన భర్త తనను పలుమార్లు మందలించాడని ఆమె రాజేశ్ కు తెలిపింది. మనస్తాపానికి గురైన..;
హైదరాబాద్ నగర శివారు అయిన పెద్ద అంబర్ పేట్ లో ఓ యువకుడి మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద అంబర్ పేట్ డాక్టర్స్ కాలనీ సమీపంలో కుళ్లిన స్థితిలో రాజేశ్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించి అతని సెల్ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేస్తుండగా.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో జరిపిన చాట్ తో వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఆమె భర్త నాగేశ్వరరావే రాజేశ్ ను హత్య చేసినట్లు భావిస్తున్నారు. టీచర్ భర్తతో పాటు ఇతర బంధువులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా.. రాజేశ్ మరణంతో తనకు సంబంధం లేదని నాగేశ్వరరావు చెబుతున్నాడు. అతనిపై తాము దాడి చేశామనడంలో వాస్తవం లేదని, రాజేశ్ ఎవరో కూడా తనకు తెలియదన్నాడు. తన భార్యకు ఎవరో ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని, ఆమెకు రాజేశ్ తో సోషల్ మీడియాలో పరిచయం ఉండి ఉండవచ్చని నాగేశ్వరరావు తెలిపాడు. తన భార్య సూసైడ్ చేసుకుందని, దానిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశాడు.
హయత్ నగర్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో రాజేశ్ కు కొంతకాలం క్రితం ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి తన భర్త తనను పలుమార్లు మందలించాడని ఆమె రాజేశ్ కు తెలిపింది. మనస్తాపానికి గురైన ఆమె తాను చనిపోతానంటూ రాజేశ్ కు మెసేజ్ లు పంపింది. అలా చేస్తే తాను కూడా చనిపోతానని రాజేశ్ చెప్పినట్లు అతని వాట్సాప్ చాట్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. మే 24వ తేదీన టీచర్ ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ సోమవారం (మే29)న మరణించింది. 24వ తేదీ నుంచీ రాజేశ్ టీచర్ ఇంటిచుట్టూ తిరగడాన్ని గమనించిన ఆమె కొడుకు అతడిని పట్టుకుని నిలదీశాడు. సెల్ ఫోన్ చెక్ చేయగా అసలు విషయం తెలియడంతో రాజేశ్ ను మందలించి, కొట్టి వదిలేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాజేశ్ ను నాగేశ్వరరావు, అతని కుటుంబ సభ్యులు హత్య చేసి ఉంటారా ? లేక అతనే ఆత్మహత్య చేసుకున్నాడా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.