ఫ్యాక్ట్ చెక్: చంద్రబాబు నాయుడు జూన్ 9 న ప్రమాణ స్వీకారం చేస్తారని ఎలాంటి ప్రకటన రాలేదు. వైరల్ అవుతున్న వీడియో కేవలం తెలుగు న్యూస్ ఛానల్ సర్వే ఫలితాలు మాత్రమే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం నాయకులు మాత్రమే కాదు.. ప్రజలు కూడా ఎంతో ఆత్రుతగా

Update: 2024-05-31 10:38 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం నాయకులు మాత్రమే కాదు.. ప్రజలు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తమ పార్టీనే అధికారంలో కొనసాగుతుందని వైసీపీ నేతలు ధీమాగా చెబుతుండగా, టీడీపీ నేతలు ఈ ఎన్నికల్లో తప్పకుండా తిరిగి అధికారంలోకి వస్తామని చెబుతున్నారు.

ఫలితాలు జూన్ 4న రావాల్సి ఉండగా.. ఆయా పార్టీల నేతలు ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు.

ఇంతలో ఓ వీడియో ఇన్స్టాగ్రామ్ లో కొన్ని లక్షల వ్యూస్ ను సాధించింది.

ఆ పోస్ట్ లో తెలుగుదేశం పార్టీకి 95 స్థానాలు, వైసీపీకి 63 స్థానాలు, జనసేనకు 13 స్థానాలు దక్కినట్లుగా ఉంది. దీన్ని బట్టి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తూ ఉందని అందులో ఉంది. జూన్ 9వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు.

"జూన్ 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు.. కూటమిదే విజయం" అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు. hyderabad9143 అనే పేజీలో ఈ వీడియోను పోస్టు చేశారు.





ALOHA VIDEOS అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా ఇదే వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియోకు 11వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Full View


ఈ పోస్టులను చూసి నిజమేనని నమ్మేస్తూ ఉన్నారు కొందరు. ఇవి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలేమోనని భావించి సోషల్ మీడియాలో షేర్ కూడా చేస్తున్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

ఏపీ ఎన్నికల ఫలితాలే ఇంకా విడుదలవ్వలేదు.. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా జూన్ 9న ప్రమాణం స్వీకారం చేస్తారంటూ టీడీపీ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు.

ఏపీ అసెంబ్లీ 2024 రిజల్ట్స్ అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా.. ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల అవుతాయని పలు మీడియా రిపోర్టులను మేము గమనించాం.

ఇక ఎగ్జిట్ పోల్స్ వివరాల గురించి సెర్చ్ చేయగా.. జూన్ 1వ తేదీ వరకూ ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల విడుదల చేసిన ప్రకటన మాకు కనిపించింది.



ఈ వైరల్ పోస్టును నిశితంగా పరిశీలించగా అందులో తెలుగు న్యూస్ ఛానల్ RTV లోగోను గమనించాం.

'Final-ఆంధ్రప్రదేశ్ గేమ్ ఛేంజర్' అనే గ్రాఫిక్స్ స్ట్రిప్ ను కూడా గమనించాం.

యూట్యూబ్ ఓపెన్ చేసి.. Rtv survey AP అనే కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. మే 4వ తేదీ ప్రముఖ జర్నలిస్ట్ రవి ప్రకాష్ సర్వే ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాలు లైవ్ కూడా వచ్చాయి. కింద లింక్ ను మీరు చూడొచ్చు. అందులో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు.. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందనే వివరాలను వెల్లడించారు.

Full View

లైవ్ వీడియోలోని 5:21:00 వద్ద ఆర్టీవీ సర్వే ఫలితాలను మీరు గమనించవచ్చు. అందులో వైసీపీకి 63, టీడీపీకి 95, జనసేన పార్టీకి 13, బీజేపీకి 3, కాంగ్రెస్ కు 1 సీటు వస్తుందని అందులో చూడొచ్చు.

ఆర్టీవీ అప్లోడ్ చేసిన మరో యూట్యూబ్ వీడియోలో కూడా ఇదే తరహా ఫలితాలను చూపించారు.

AP Election Full & Final : ఏపీ సీఎం ఎవరు?| Ravi Prakash |Game Changer | Jagan, Chandrababu| RTV అనే టైటిల్ తో ఆర్టీవీ వీడియోను విడుదల చేసింది. పలు సందర్భాల్లో ఆయా పార్టీకి వచ్చే సీట్లను అంచనా వేస్తూ వీడియోలో చూపించారు.

Full View


తెలుగుదేశం పార్టీ అధికార సోషల్ మీడియా ఖాతాలను కూడా మేము నిశితంగా పరిశీలించాం. అందులో ఎక్కడా కూడా జూన్ 9వ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే పోస్టులు మాకు కనిపించలేదు.

కాబట్టి, చంద్రబాబు నాయుడు జూన్ 9న ప్రమాణం స్వీకారం చేస్తున్నారనే పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న వీడియోకు.. ఏపీ ఎన్నికల ఫలితాలకు లేదా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం తెలుగు మీడియా ఛానల్ చేసిన సర్వే ఫలితాలు మాత్రమే.


Claim :  చంద్రబాబు నాయుడు జూన్ 9 న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News