ఫ్యాక్ట్ చెక్: DMart ఎలాంటి ఆన్‌లైన్ క్విజ్ పోటీలను పెట్టలేదు.. అలాంటి లింక్ లపై క్లిక్ చేసి మీ డేటాను ఇతరుల చేతుల్లో పెట్టకండి
Dmart సంస్థ మొహర్రం కానుకగా గిఫ్ట్ కూపన్లను అందిస్తోంది.
ఆన్ లైన్ క్విజ్‌లో పాల్గొనడం ద్వారా, మీరు DMart ద్వారా ముహర్రం గిఫ్ట్ ని గెలుచుకునే అవకాశం ఉందనే తప్పుడు వాదనతో WhatsApp, ఇతర సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో లక్కీ డ్రా లింక్ ను షేర్ చేస్తున్నారు.
వైరల్ లింక్ లో 65,402.40 రూపాయలు గెలుచుకునే అవకాశం ఉందంటూ చెబుతున్నారు.
అందులో ఉన్న ప్రశ్నలు.. "మీకు డీమార్ట్ గురించి తెలుసా? అవునా/కాదా" లాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతారు.
మీరు ఏదైనా లింక్ పై క్లిక్ చేస్తే.. తర్వాతి ప్రశ్నకు వెళుతుంది.
క్విజ్ చివరలో, "మీకు రూ. 65,404.40 గెలుచుకునే అవకాశం ఉంది. మీరు మీ బహుమతికి సంబంధించి సరైన పెట్టెను ఎంచుకోవాలి; మీకు 3 ప్రయత్నాలు ఉంటాయి" అంటూ అందులో ఉంది.
తదుపరి దశలో, కొన్ని బహుమతికి సంబంధించిన పెట్టెలు కనిపిస్తాయి . మీరు వాటిలో దేనినైనా క్లిక్ చేయాలి. సూచనల ప్రకారం, మీ బహుమతిని క్లెయిమ్ చేయడానికి మీరు సరైన పెట్టెను ఎంచుకోవాలి.
అలా మీరు ఏదైనా బాక్స్ ను సెలెక్ట్ చేసుకుంటే.. అప్పుడు మీకు సర్ ప్రైజ్.. 65,404.40 రూపాయలు గెలుచుకుంటారు. కంగ్రాట్స్ చెబుతూ మీ ముందు ఒక మెసేజీ కనిపిస్తుంది. దీన్ని 5 గ్రూపులలో కానీ.. 20 మందికి కానీ పంపించాలని అడుగుతారు. అలాగే మీ సమాచారం పూరించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తీ చేయమని అడుగుతారు.
మీ గిఫ్ట్ మీకు 5-7 రోజుల్లో పంపిస్తామని చెబుతారు.
కామెంట్స్ లో పలువురు తమకు ఈ గిఫ్ట్ కార్డులు అందాయంటూ చెప్పడం మీరు చూడొచ్చు. కొంతమంది వినియోగదారులు "ఇది నిజం, నేను అదే రోజు బహుమతిని అందుకున్నాను.. బహుమతి ఇచ్చినందుకు DMart కి ధన్యవాదాలు." మరొక వినియోగదారుడు.. “నిజానికి, నేను పనిని పూర్తి చేసిన రోజునే నాకు బహుమతి వచ్చింది, బహుమతి ఇచ్చినందుకు DMartకి ధన్యవాదాలు" అని కామెంట్ చేశాడు.
ఫ్యాక్ట్ చెకింగ్:
మేము DMart అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్‌లను తనిఖీ చేసాము. కానీ ముహర్రం ఆఫర్‌కు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ లభించలేదు.
మేము మొదట DMart అధికారిక వెబ్‌సైట్‌లో “online questionnaire” కోసం కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. కానీ అలాంటి అధికారిక ప్రకటన లేదా నోటిఫికేషన్ కనుగొనలేకపోయాం. వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో అందుకు సంబంధించి ఎటువంటి ప్రస్తావనలు కనిపించలేదు.
మేము వారి అధికారిక సైట్‌లో DMart అధికారిక నోటిఫికేషన్‌ను కనుగొన్నాము. “ప్రియమైన కస్టమర్‌లు - మా ఆఫర్‌లు / ప్రమోషన్‌లు, కస్టమర్ కేర్ సంప్రదింపు వివరాలు మా వెబ్‌సైట్‌లలో (www.dmartindia.com , www.dmart.in), DMart రెడీ యాప్, మా స్టోర్‌లలో ఉన్నాయి. దయచేసి ఏ తెలియని నంబర్‌లకు కాల్ చేయవద్దు లేదా ఏదైనా తెలియని లింక్‌లు, సారూప్య లింక్‌లపై క్లిక్ చేయవద్దు. దయచేసి వెబ్‌సైట్ పేరును జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఇవి ఫిషింగ్ వెబ్‌సైట్‌లు కావచ్చని హెచ్చరించారు.
మీరు జాగ్రత్తగా గమనిస్తే, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న URL లింక్‌లు DMart అధికారిక వెబ్‌సైట్‌లు అయిన dmartindia.com లేదా dmart.inతో ప్రారంభం కావు.
https://qjof.buzz అంటూ ప్రారంభమవ్వడం మనం గమనించవచ్చు.
సర్క్యులేట్ చేస్తున్న లింక్ నకిలీదని మేము కనుగొన్నాము. DMart ముహర్రం సందర్భంగా ఎలాంటి క్విజ్ ను కూడా ప్రవేశపెట్టలేదు.