ఫ్యాక్ట్ చెక్: కొడాలి నాని వైసీపీకి రాజీనామా చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు

తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని వివరణ;

Update: 2025-01-27 08:28 GMT
ఫ్యాక్ట్ చెక్: కొడాలి నాని వైసీపీకి రాజీనామా చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
  • whatsapp icon

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు రిటైర్మెంట్‌ ప్రకటించడమే కాకుండా.. రాజ్యసభకు రాజీనామా చేశారు.

రాజకీయాల నుండి రిటైర్ అవుతున్నానని విజయ్ సాయి రెడ్డి ఒక పోస్ట్‌లో ప్రకటించారు. "రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని.జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను." అంటూ పోస్టు పెట్టారు. ఆయన రాజీనామాకు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆమోదం తెలిపారు కూడా.

ఇలాంటి పరిస్థితుల్లో పలువురు నేతలు వైసీపీని వీడబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. కొడాలి నాని వైసీపీకి రాజీనామా చేశారంటూ పోస్టులు వైరల్ అయ్యాయి. "నా ఆరోగ్యం కారణాలు దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను ఈ నెల 25వ తేదీన వైఎస్ ఆర్ సీపీ కి రాజీనామా చేయబోతున్నాను నన్ను ఎంతగానో ఆదరించిన గుడివాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను" అంటూ కొడాలి నాని పేరు మీద ఉన్న అకౌంట్ నుండి పోస్టు వచ్చింది.


వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. వైసీపీని వీడుతున్నట్లు కొడాలి నాని ఎలాంటి ప్రకటన చేయలేదు.

కొడాలి నాని వైసీపీని వీడినట్లు ప్రకటించి ఉంటే అది తప్పకుండా వార్తల్లో నిలిచి ఉండేది. మేము సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా మాకు అలాంటి కథనాలు ఏవీ కనిపించలేదు.

233.8K ఫాలోవర్లు ఉన్న కొడాలి నాని అధికారిక అకౌంట్ @IamKodaliNani. ఇందులో ఆయన పలు సందర్భాల్లో ట్వీట్లు పెట్టారు.

వైరల్ పోస్టులో ఎలాంటి నిజం లేదంటూ ఆయన అధికారిక పేజీలో తాను వైసీపీని వీడుతున్న ఫోటోను ఫేక్ అంటూ కొట్టిపారేశారు. ఫేక్ అకౌంట్స్ నుండి వచ్చే పోస్టులను నమ్మొద్దని సూచించారు.



కొడాలి నాని అఫిషియల్ ఎక్స్ అకౌంట్ "@IamKodaliNani", అలాగే వైరల్ ట్వీట్‌ చేసిన "@IamKodaaliNani" అకౌంట్‌కు ఒక్క అక్షరం మాత్రమే తేడా ఉందని మేము గమనించాం. అలాగే ఫేక్ అకౌంట్ ఇప్పుడు మనుగడలో లేదని గుర్తించాం.


 

సంబంధిత కీవర్డ్స్ తో మేము గూగుల్ సెర్చ్ చేయగా.. కొడాలి నాని వైసీపీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదంటూ పలు మీడియా కథనాలను మేము గుర్తించాం. "రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన కొడాలి నాని" అంటూ పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. కొడాలి నాని వైసీపీకి రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదు.


Claim :  కొడాలి నాని వైసీపీకి రాజీనామా చేశారు
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News