ఫ్యాక్ట్ చెక్: కొత్తగా పెళ్ళైన జంట పాకిస్థాన్-ఇండియా మ్యాచ్ చూడలేదు
భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి కొత్త జంట వచ్చారు. దురదృష్టవశాత్తు వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది
కొత్తగా పెళ్లయిన జంట.. భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఆసియా కప్ 2023లో జరిగిన మ్యాచ్‌ని వీక్షించేందుకు వివాహ వేడుక నుండి నేరుగా స్టేడియానికి వచ్చారని పేర్కొంటూ ఒక ఫోటో వైరల్‌గా మారింది. పెళ్లి వస్త్రాల్లో ఆ జంట స్టేడియంలో కనిపించింది.
ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా సైట్స్ లో ఈ ఫోటో వైరల్ గా మారింది.
Kashmir Dispatch అనే వార్తాపత్రిక ఫేస్‌బుక్‌లో ఇందుకు సంబంధించి ఒక ఫోటోను కూడా షేర్ చేసింది. "ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ క్రేజ్, శ్రీలంకలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో ప్రత్యర్థుల మధ్య జరిగిన గొప్ప మ్యాచ్ ను చూడటానికి వచ్చిన నవ వధువులు." అంటూ చెప్పుకొచ్చారు.
ఇడియోటిక్ మైండ్స్ అనే ఫేస్‌బుక్ పేజీలో ఆ ఫోటోను "భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి కొత్త జంట వచ్చారు. దురదృష్టవశాత్తు వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది" అనే క్యాప్షన్‌తో ప్రచురించారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
కొన్ని రోజుల క్రితం యూట్యూబ్‌లో షేర్ చేసిన వీడియోకు సంబంధించినది ఈ ఫోటో. కొత్త జంటకు సంబంధించిన ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ చిత్రం ఆగస్ట్ 31, 2023న ముల్తాన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లోనిది. ఇది సెప్టెంబర్ 2, 2023న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కు సంబంధించినదని ప్రచారం చేశారు.
వైరల్ ఫోటో కు సంబంధించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన వీడియో లింక్ మాకు కనిపించింది. దీని ప్రకారం సెప్టెంబర్ 2న శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగడానికి ఒక్కరోజు ముందు ఈ వీడియోను అప్లోడ్ చేశారు. "Newlyweds come to watch the exciting match between Pakistan and Nepal at the Multan Cricket Stadium." అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.
పాకిస్తానీ న్యూస్ పేపర్ MinuteMirror.com.Pk దీనికి సంబంధించిన కథనాన్ని అప్లోడ్ చేశారు. సెప్టెంబర్ 1న దీని గురించి నివేదించారు. ముల్తాన్‌లోని నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ని చూడటానికి పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం అభిమానులు, కొత్తగా పెళ్లయిన జంట వచ్చిందని సెప్టెంబర్ 1న ఒక కథనాన్ని ప్రచురించింది.
ఏయే దేశాల మధ్య మ్యాచ్ ఆడినట్లు నివేదికలో పేర్కొనకపోయినప్పటికీ.. ఈ నివేదిక ప్రచురించిన మునుపటి తేదీ ఆగస్టు 31న పాకిస్థాన్- నేపాల్ మధ్య మ్యాచ్ జరిగినట్లు గుర్తించవచ్చు.
క్రికెట్ ఇన్ బ్లడ్ అనే యూట్యూబ్ ఛానెల్ ఆగస్టు 31న నవ వధూవరుల వీడియో క్లిప్‌ను ప్రచురించింది.
థ్రిల్ పాకిస్థాన్ అనే యూట్యూబ్ ఛానెల్ సెప్టెంబర్ 1న నవ వధువులకు సంబంధించి 1.19 నిమిషాల వీడియోను ప్రచురించింది. ముల్తాన్‌లో జరిగిన పాకిస్తాన్-నేపాల్ మ్యాచ్ చూడటానికి వచ్చినట్లు వీడియోలోని వాయిస్ ద్వారా మనకు తెలుసు.
కాబట్టి, భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు కొత్తగా పెళ్ళైన జంట వచ్చారన్న వాదన తప్పుదారి పట్టిస్తోంది.