ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ జరిగిందంటున్న వైరల్ వీడియో ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది
హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్
మే 13, 2024న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది. ఎన్నికలు సజావుగా ముగిశాయి. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి అసదుద్దీన్ ఒవైసీపై.. బీజేపీ నాయకురాలు మాధవి లత పోటీ చేస్తున్నారు. అయితే ఓట్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పోలింగ్ బూత్ బయట నిరసనకు దిగారు. పోలింగ్ బూత్‌ల వద్ద కొందరు సిబ్బంది కారణంగా రిగ్గింగ్ జరిగిందని ఆమె ఫిర్యాదు చేశారు. ఇక బురఖా ధరించిన ఓటర్లను గుర్తించేందుకు వారి ముసుగులు తొలగించాలని ఆమె కోరారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఈ విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది.
బహదూర్‌పురాలోని పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ జరుగుతున్నట్లు ఆరోపిస్తూ ఓ వీడియో వైరల్ అయింది. వీడియోలో ఓ వ్యక్తి నకిలీ ఓట్లు వేయడానికి ఈవీఎం బటన్లను పదేపదే నొక్కుతూ ఉండగా.. మరొక వ్యక్తి సమీపంలోని డెస్క్‌పై కూర్చుని పేపర్‌వర్క్ చేస్తున్నాడు.
ఈ వీడియో ట్విట్టర్‌లో విస్తృతంగా వైరల్ అయింది. ఎంఐఎం నాయకులు ఈ పని చేశారంటూ సోషల్ మీడియా వినియోగదారులు ఆరోపించారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది. ఈ వీడియో పాతది.. 2022లో పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఘటన.
మేము వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. అదే వీడియోను పశ్చిమ బెంగాల్‌లోని BJP, కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రచురించినట్లు మేము కనుగొన్నాము.
తదుపరి శోధనలో, ఈ వీడియోను TV9 బంగ్లా ఫిబ్రవరి 27, 2022న అప్లోడ్ చేసినట్లు కూడా మేము కనుగొన్నాము. వీడియో టైటిల్ లో ‘WB మున్సిపల్ ఎన్నికలు 2022’ అని ఉంది.
| দক্ষিণ দমদমের ৩৩ নং ওয়ার্ডের ১০৮ নং বুথে ভোটার না, ভোট দিলেন এজেন্ট’
అనువదించగా.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో 2022 సంవత్సరంలో జరిగిందని.. సౌత్ డమ్ డమ్‌లోని వార్డ్ నంబర్ 33లోని బూత్ నంబర్ 108 వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు.
ఆ వీడియో పాతదని, అది తెలంగాణకు చెందినది కాదని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు.
అధికారిక వివరణలో “ప్రిసైడింగ్ అధికారి (సర్జికల్ మాస్క్ ధరించి) ఉన్న పోలింగ్ స్టేషన్ లోపలి భాగాన్ని చూపించే వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. క్లిప్‌లో ఒక వ్యక్తి (చారల ముదురు నీలం రంగు రౌండ్ కాలర్ T షర్టు ధరించి) ఒక కంపార్ట్‌మెంట్ పక్కన నిలబడి ఉన్నట్లు చూపిస్తుంది. వ్యక్తులు కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి బయటకు వస్తున్నారు, అయితే వ్యక్తి (నీలిరంగు చారల టీ షర్ట్‌లో) కంపార్ట్‌మెంట్ లోపలికి వెళ్లే వ్యక్తులకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఒక వ్యక్తి కంపార్ట్‌మెంట్ నుండి బయటకు వచ్చిన ప్రతిసారీ EVM బీప్ సౌండ్ వినబడుతుంది. ఈ వీడియో హైదరాబాద్ బహదూర్‌పురా కి చెందినదని, పోలింగ్ స్టేషన్‌లో రిగ్గింగ్ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇది పాత వీడియో, ఇది తెలంగాణలోని పార్లమెంట్ ఎన్నికలకు లేదా తెలంగాణలోని మరే ఇతర ఎన్నికలకు సంబంధించింది కాదని చెబుతున్నాం." అంటూ ఉంది.
అందువల్ల, వైరల్ వీడియో హైదరాబాద్ కు చెందినది కాదు. బహదూర్‌పురాలో రిగ్గింగ్ జరిగినట్లు ఎలాంటి కథనాలు కూడా రాలేదు. వైరల్ వీడియో పశ్చిమ బెంగాల్‌కు చెందినది. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా కథనాలను ప్రసారం చేస్తున్నారు.
Claim : హైదరాబాద్‌లోని బహదూర్‌పురలోని ఓ పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు
Claimed By : Social Media Users
Fact Check : False