ఫ్యాక్ట్ చెక్: మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పిన్ కారణంగా ఓ యువతి మరణించిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు
వైరల్ వీడియోలో యువతి చనిపోలేదు;

మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ ఉండగా కరెంట్ షాక్ కొట్టి పలువురు చనిపోయిన ఘటనల గురించి మనం వినే ఉంటాం. ఎలక్ట్రానిక్ డివైజ్ లు ఉపయోగించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పలువురు నిపుణులు కూడా సూచించారు.
అయితే ఓ మహిళ మొబైల్ ఫోన్ కు ఛార్జింగ్ పెడుతూ ఎలక్ట్రిక్ షాక్ కు గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. journalistjhansirani అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఒకటిన్నర లక్షకు పైగా లైక్స్ వచ్చిన వీడియోలో పై భాగంలో ఓ మహిళ ఎలక్ట్రిక్ షాక్ కు గురవ్వగా, కింద మరో మహిళ వివరణ ఇవ్వడం మనం చూడొచ్చు.
"ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడ్డు జాగ్రత్త ఇలాంటి తప్పు మీరు అసలు చేయకండి #feed #reelsfit #foryou #viral #reelsinstagram #todaytrending #viral" అంటూ డిసెంబర్ 28న వీడియోను పోస్టు చేశారు.
వైరల్ వీడియోలో ఓ మహిళ తన ఫోన్ ను ఛార్జింగ్ పెట్టడానికి సిద్ధమైంది. ఛార్జర్ నుండి మొబైల్ ఫోన్ కు కనెక్ట్ చేసిన వైర్ ను ఆ మహిళ నాలుకతో తాకడానికి ప్రయత్నించగా ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కరెంట్ షాక్ కారణంగా మహిళ కుప్పకూలిపోయిందని వీడియో షేర్ చేస్తున్న వారు చెబుతున్నారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను మీరు ఇక్కడ చూడొచ్చు:
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. కరెంట్ షాక్ తో కింద పడిపోయినట్లు నటించిన మహిళ ఓ కంటెంట్ క్రియేటర్. ఆమె బ్రతికే ఉన్నారు.
వైరల్ వీడియోల చివరిలో ఇన్స్టాగ్రామ్ ఖాతా mrs.bundelkhand_sandhya_tiwari అనే పేరు ఉండడం మేము గమనించాం.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. కరెంట్ షాక్ తో కింద పడిపోయినట్లు నటించిన మహిళ ఓ కంటెంట్ క్రియేటర్. ఆమె బ్రతికే ఉన్నారు.
వైరల్ వీడియోల చివరిలో ఇన్స్టాగ్రామ్ ఖాతా mrs.bundelkhand_sandhya_tiwari అనే పేరు ఉండడం మేము గమనించాం.
ఇన్స్టాగ్రామ్ లో mrs.bundelkhand_sandhya_tiwari అంటూ మేము సెర్చ్ చేయగా సంధ్య తివారి అనే వీడియో క్రియేటర్ పేజీ మాకు లభించింది. ఆమె ఖాతాలో పలు వీడియోలను మేము గుర్తించాం. ఆమె ఖాతాకు సంబంధించిన లింక్ ఉంది. ఇక్కడ
ఇక వైరల్ వీడియోను డిసెంబర్ 14, 2024న సంధ్య తివారీ తన అకౌంట్ లో షేర్ చేశారని మేము గుర్తించాం. ఆ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఈ వీడియో కింద కామెంట్స్ లో యాక్టింగ్ చాలా బాగా చేసారంటూ కామెంట్స్ మేము గమనించాం.
వైరల్ వీడియో లోని మహిళ ఆ తర్వాత పలు వీడియోలలో నటిస్తూ కనిపించిందని మేము గుర్తించాం. వైరల్ వీడియోకు సంబందించిన వివరణ కోసం తెలుగు పోస్టు టీమ్ mrs.bundelkhand_sandhya_tiwari అకౌంట్ ను సంప్రదించింది. ఆ అకౌంట్ నుండి వివరణ రాగానే ఈ కథనాన్ని అప్డేట్ చేస్తాం.
కాబట్టి, ఆ మహిళ కరెంట్ షాక్ తో మరణించలేదని ధృవీకరించాం. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ వీడియోను పలువురు నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
కరెంట్ షాక్ కొట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఈ డిజిటల్ యుగంలో, మన మొబైల్ ఫోన్స్ మన జీవితంలో అంతర్భాగంగా మారాయి. కమ్యూనికేషన్, వినోదం, లెక్కలేనన్ని ఇతర పనుల కోసం మొబైల్స్ పై ఆధారపడి బతుకుతున్నాం. మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేయడం దినచర్యగా మారింది. అయితే ఛార్జింగ్ సమయంలో చేసే తప్పులు, ఛార్జర్ వంటి వస్తువుల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన విద్యుత్ షాక్‌కు గురయ్యే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఒరిజినల్ ఛార్జర్, కేబుల్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. నాసిరకం నాణ్యత లేని ఛార్జర్లు, కేబుల్స్ ప్రమాదకరం. భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉన్నవి, పలు సంస్థల ధృవీకరణ ఉన్నవి మాత్రమే ఎంచుకోండి. మీ ఛార్జర్‌ని ప్లగ్ చేయడానికి ముందు, కేబుల్, అడాప్టర్ రెండింటినీ జాగ్రత్తగా పరిశీలించండి, ఏవైనా కట్ అయిన వైర్లు, ఛార్జర్ లో ఏదైనా తేడా ఉన్నట్లు గమనించినట్లయితే వెంటనే ఛార్జర్ లేదా కేబుల్‌ను మార్చండి.
నీరు, విద్యుత్తు ప్రమాదకరమైన కలయిక, కాబట్టి మీ ఛార్జింగ్ ప్రాంతం పొడిగా ఉండేలా చూసుకోండి. ఒకే సాకెట్‌లో బహుళ ఛార్జర్‌లు, పరికరాలను ప్లగ్ చేయడం ద్వారా మీ పవర్ అవుట్‌లెట్‌లను ఓవర్‌లోడ్ చేయవద్దు. ఓవర్‌లోడింగ్ వేడెక్కడానికి కారణమవుతుంది, ఇది విద్యుత్ ప్రమాదాలకు దారితీయవచ్చు. మండే పదార్థాల దగ్గర ఛార్జింగ్ పెట్టకపోవడమే మంచిది. కొన్ని కొన్ని సార్లు అగ్ని ప్రమాదాలకు దారి తీస్తుంది. మండే వస్తువులకు మొబైల్ ఫోన్స్ ను ఛార్జర్ లను దూరంగా ఉంచండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారికి ఛార్జింగ్ గురించి సరైన సమాచారం, పొంచి ఉన్న ప్రమాదాల గురించి వివరించడం చాలా ముఖ్యం.
Claim : మొబైల్ ఛార్జింగ్ పిన్ ను నోట్లో పెట్టుకున్న యువతి కరెంట్ షాక్ తో ప్రాణాలు వదిలింది
Claimed By : Social Media Users
Fact Check : Misleading