2022 సంవత్సరానికి అమ్మఒడి, వాహనమిత్ర పద్ధకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేస్తోందా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజ్యముద్రతో ఉన్న ఒక ప్రెస్ నోట్ ఇమేజ్ వాట్సాప్ లాంటి సోషల్ నెట్వర్క్, ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా విస్తృతంగా షేర్ అవుతోంది.;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజ్యముద్రతో ఉన్న ఒక ప్రెస్ నోట్ ఇమేజ్ వాట్సాప్ లాంటి సోషల్ నెట్వర్క్, ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా విస్తృతంగా షేర్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ విడుదల చేసినట్లుగా చెప్పబడిన ఆ ప్రెస్ నోట్.. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర పధకాలను 2022 సంవత్సరానికి రద్దు చేస్తున్నట్లుగా ప్రజలకు తెలియజేస్తోంది. ఈ ప్రెస్ నోట్ ఇమేజిని iTDP Guntur, #Bose DK WhoKilledBabai వంటి ఎకౌంట్లు షేర్ చేశాయి.
అయితే, ఈ మెసేజ్ లను చూసి కంగారూ పడిన కొందరు లబ్ధిదారులు ప్రభుత్వ అధికారులను సంప్రదించి, ఆయా పధకాల అమలుపై ప్రశ్నించటం మొదలుపెట్టారు.
Fact Check:
సాధారణంగా సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా వేర్వేరు అంశాలు, సమస్యలపై ప్రభుత్వం ప్రెస్ నోట్స్ విడుదల చేస్తుంది. అయితే, ఈ ఇమేజ్ లో చెప్పబడినట్లుగా సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ అనేది ఏదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లేదు. ఐ&పిఆర్ డిపార్ట్మెంట్ కూడా తాము రిలీజ్ చేసే ప్రెస్ నోట్లను సోషల్ మీడియాని అధికారిక ఖాతాల ద్వారా, లేదా ఇమెయిల్ లిస్టుల ద్వారా డాక్యుమెంట్ రూపంలో మీడియాకు చేరవేస్తుంది, కానీ ఇలాంటి ఇమేజ్ ఫార్మాట్ లో మాత్రం పంపదు.
ప్రజల ఆందోళనను గమనించిన సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఈ ఇమేజ్ లో ఉన్న ప్రెస్ నోట్ నకిలీదని ప్రకటించారని సాక్షి టీవి తమ సోషల్ మీడియా ఎకౌంట్లో వివరించింది. ఐ&పిఆర్ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పధకాల అమలుపై తప్పుడు సమాచారం అందించేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారని సాక్షి టీవి ప్రకటించింది.
అలాగే ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా షేర్ చేయబడుతూన్న ఇమేజ్ పై స్పందించింది. ఆ ఇమేజ్ లోని సమాచారం అబద్ధమని, ఈ అసత్య ప్రచారం చేస్తున్న కొన్ని అకౌంట్లను గుర్తించామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
కాబట్టి, అమ్మఒడి, వాహనమిత్ర లాంటి సంక్షేమ పధకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దుచేస్తోందనే సమాచారం అసత్యం. ఈ అసత్య సమాచారాన్ని దురుద్దేశ్యంతో ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.
Claim: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి, వాహనమిత్ర సంక్షేమ పధకాలను 2022 సంవత్సరానికి రద్దుచేస్తోంది.
Claimed by: సోషల్ మీడియా యూజర్లు
Fact Check: FALSE