ఫ్యాక్ట్ చెక్: ప్లేట్లల్లో ఉంచిన లడ్డూలను ముకేశ్ అంబానీ వెనక్కు తీసుకోలేదు. ఒరిజినల్ వీడియోను రివర్స్ చేశారు
అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ జూలై 12, 2024న ముంబైలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ముందు, ఆ తర్వాత కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు ఈ మెగా వెడ్డింగ్ కు హాజరయ్యారు.
అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ జూలై 12, 2024న ముంబైలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ముందు, ఆ తర్వాత కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు ఈ మెగా వెడ్డింగ్ కు హాజరయ్యారు. ఈ సంబరాలు నెలల తరబడి కొనసాగాయి. పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
బకింగ్‌హామ్‌షైర్‌లోని ప్రసిద్ధ 7-స్టార్ స్టోక్ పార్క్ లగ్జరీ హోటల్, గోల్ఫింగ్ ఎస్టేట్‌లో అంబానీలు వివాహానంతర వేడుకను నిర్వహిస్తున్నారని పలు మీడియా సంస్థలు ఇటీవలే నివేదించాయి. అయితే, ఈ వార్తలను హోటల్ ఖండించింది. వివరణ కూడా ఇచ్చింది.
ముకేశ్ అంబానీ తినడానికి సిద్ధంగా కూర్చున్న వ్యక్తుల దగ్గరికి వెళ్లి, వారి ప్లేట్‌లలో వడ్డించిన లడ్డూలను తీసుకెళుతున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. పెళ్లి సమయంలో వారి వద్ద లడ్డూలు అయిపోయాయని, అందుకే అంబానీ వెనక్కు తీసుకెళ్తున్నారనే వాదనతో వైరల్ అవుతోంది. సామాన్యుల ప్లేట్‌లోని లడ్డూలను ధనికులకు అందించడానికి తీసుకుని వెళ్తున్నాడంటూ పోస్టులు పెట్టారు.
'భోజనాలు తక్కువ వచ్చాయి.. మీరు కాస్త అడ్జస్ట్ చేసుకోవాలంటూ' ముకేశ్ అంబానీ వాళ్లకు సూచించారనే వాదనలో పోస్టులు వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ముఖేష్ అంబానీ ఆహ్వానితుల ప్లేట్ల నుండి లడ్డూలను వెనక్కు తీసుకుంటూ ఉన్నారని చూపించే అసలు వీడియోను రివర్స్ చేశారు.
మేము అనంత్ అంబానీ వివాహం ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు సంబంధించి.. కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు, ఫిబ్రవరిలో అంబానీలు రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో గ్రామస్తులకు భోజనం అందించారని కనుగొన్నాం. వివాహానికి ముందు ఆయన గ్రామస్థులకు స్వయంగా వడ్డించారని మేము కనుగొన్నాము.
ముఖేష్ అంబానీ లడ్డూలు అందిస్తున్న వీడియోను ANI షేర్ చేసింది “#WATCH | జామ్‌నగర్, గుజరాత్: జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అన్నదానంతో ప్రారంభమయ్యాయి. ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, అంబానీ కుటుంబ సభ్యులు గ్రామస్తులకు సాంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని వడ్డించారు. రాధిక అమ్మమ్మ, తల్లిదండ్రులు వీరేన్, శైలా మర్చంట్ కూడా ఈ అన్నదానంలో భాగమయ్యారు." అని నివేదించడం చూశాం.
ఇదే వీడియోను పలు మీడియా సంస్థల యూట్యూబ్ ఛానెల్స్ కూడా షేర్ చేశాయి.
DeshGujaratiHD అనే యూట్యూబ్ ఛానల్ ‘Mukesh Ambani, Anant, Radhika cater 51,000 villagers in Jamnagar | Pre-wedding mass meal’ టైటిల్ తో వీడియోను షేర్ చేసింది.
ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, బిలియనీర్ ముఖేష్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకను ప్రారంభించారు. జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలోని గ్రామస్థులకు ఆహారం స్వయంగా వడ్డించారు. ముకేష్ అంబానీ, అనంత్ అంబానీ, ఇతర కుటుంబ సభ్యులు గ్రామస్తులకు సాంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని అందించారని కూడా నివేదించారు. వధువు వైపు నుండి, రాధిక అమ్మమ్మ, తల్లిదండ్రులు వీరేన్, శైలా మర్చంట్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ అన్నదానం కొన్ని రోజుల పాటూ కొనసాగుతుందని.. 51 వేల మంది స్థానిక ప్రజలకు భోజనాలు అందించాలని అనుకున్నారని కథనాల్లో తెలిపారు.
ముఖేష్ అంబానీ అతిథుల ప్లేట్ల నుండి లడ్డూలను వెనక్కు తీసుకుంటున్నట్లు చూపించే వైరల్ వీడియోను ఎడిట్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోను.. ఒరిజినల్ వీడియోను కాస్తా రివర్స్ చేశారు. అసలు వీడియోలో ముఖేష్ అంబానీ టేబుల్ వద్ద కూర్చున్న వారికి లడ్డూలు పెడుతున్నట్లు గుర్తించాం. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.