ఫ్యాక్ట్ చెక్: ఎస్సీ, ఎస్టీలకు కుల ప్రాతిపదికన ఇస్తున్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు
కుల ఆధారిత రిజర్వేషన్ వ్యవస్థపై ప్రధాని మోదీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లుగా
కుల ఆధారిత రిజర్వేషన్ వ్యవస్థపై ప్రధాని మోదీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లుగా.. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో #NoVoteToBJP అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో రిజర్వేషన్స్ కు ప్రధాని మోదీ వ్యతిరేకమనే విధంగా పోస్టులు పెడుతున్నారు.
పీఎం మోదీ మాట్లాడుతూ ఉండగా.. భారత ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ కర్ కుర్చీలో ఉండడం వీడియో క్లిప్ లో కనిపిస్తుంది. వీడియోలో.. మోదీ మాట్లాడుతూ.. “నేను ఏ విధమైన రిజర్వేషన్‌లకు, ముఖ్యంగా ఉద్యోగాలలో మద్దతు ఇవ్వను. అసమర్థతను ప్రోత్సహించే ఏ వ్యవస్థకైనా నేను వ్యతిరేకం. అందువల్ల, నేను దానిని ప్రారంభం నుండి వ్యతిరేకించాను." అని చెప్పారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వీడియోలో.. రాజ్యసభ ఎక్స్-అఫీషియో ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న వైస్ ప్రెసిడెంట్ ధన్ కర్ ఉండడం గమనించవచ్చు. రాజ్యసభ లో ప్రధాని మోదీ ప్రసంగం జరిగిందని మనం గుర్తించవచ్చు. ఈ వివరాలను ఉపయోగించి యూట్యూబ్‌లో కీవర్డ్ సెర్చ్ నిర్వహించగా.. ది ఎకనామిక్ టైమ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రచురించిన వీడియో కనుగొనబడింది. ఈ వీడియోలో రాజ్యసభ వేదికపై ప్రధాని మోదీ చేసిన ప్రకటనకు సంబంధించిన ఎక్కువ నిడివి ఉన్న వీడియో ఉంది.
ఈ వీడియోలో విపక్షాల ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఎస్సీ/ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించేవారే కాదేమోనని నా సందేహం!" "వారి ఆలోచనలు ఎప్పుడూ ఇలాగే ఉన్నాయని చూపించడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను ఇలా చెబుతున్నాను. ఆధారాలు లేకుండా మాట్లాడటానికి నేను ఇక్కడ లేను, గౌరవనీయమైన స్పీకర్ సార్" అని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.
నేను నెహ్రూ రాసిన లేఖను చదువుతానని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఈ లేఖను దేశ ప్రధాన మంత్రి పండిట్ నెహ్రూ ఆ సమయంలో దేశంలోని ముఖ్యమంత్రులకు రాశారు. ఇది రికార్డులో ఉంది. నేను అనువాదం చదువుతున్నానని అన్నారు మోదీ. 'నాకు ఎలాంటి రిజర్వేషన్లు, ముఖ్యంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇష్టం లేదు. అసమర్థతను ప్రోత్సహించే, రెండవ తరగతికి దారితీసే ఏ దశకైనా నేను వ్యతిరేకం.' అని అన్నారు నెహ్రూ అంటూ లేఖను చదివి వినిపించారు ప్రధాని మోదీ.
ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ.. "ఇది పండిట్ నెహ్రూ జీ ముఖ్యమంత్రులకు వ్రాసిన లేఖ, అందుకే, ఆ పార్టీ నేతలు ఎల్లప్పుడూ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తారని నేను చెప్తున్నాను. నెహ్రూ జీ చెప్పేవారు, SC, ST, OBC వర్గాలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు లభిస్తే, ప్రభుత్వ పనితీరు దిగజారిపోతుందని అన్నారు." అని తెలిపారు.
ప్రధాని మోదీ పూర్తి ప్రసంగాన్ని PIB వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఫిబ్రవరి 7, 2024న రాజ్యసభ సెషన్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రతిస్పందిస్తూ ఆయన ఈ ప్రసంగం చేశారు. ప్రధాని మోదీ ఉటంకించిన లేఖను భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జూన్ 27, 1961న రాశారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం లేఖలో.. నెహ్రూ రిజర్వేషన్‌లపై వ్యతిరేకతను వ్యక్తం చేశారు, “మేము షెడ్యూల్డ్ కులాలు, తెగలకు సహాయం చేయడానికి కొన్ని నియమాలు, సంప్రదాయాలతో ముడిపడి ఉన్నాము అనేది నిజం. వారు సహాయానికి అర్హులు అయినప్పటికీ, నేను ఎలాంటి రిజర్వేషన్లను ఇష్టపడను, ముఖ్యంగా సేవల్లో అసలు ఒప్పుకోను. రెండవ-స్థాయి ప్రమాణాలకు దారితీసే దేనికైనా నేను తీవ్రంగా ప్రతిస్పందిస్తాను. నా దేశం అన్నింటిలో ఫస్ట్ క్లాస్ దేశంగా ఉండాలని కోరుకుంటున్నాను. వెనుకబడిన వర్గానికి సహాయం చేయడానికి ఏకైక నిజమైన మార్గం మంచి విద్యావకాశాలను అందించడం" అని లేఖలో నెహ్రూ చెప్పారు.
ఈ లేఖను ఆధారంగా చేసుకునే ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. దళితులు, వెనకబడినవారికి, గిరిజనులకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమని, ఉద్యోగాల్లో ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లకు జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకమని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఓబీసీలకు ఎప్పుడూ పూర్తి రిజర్వేషన్లు ఇవ్వని కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని బోధించకూడదని.. అంబేద్కర్ భారతరత్నకు అర్హడని కాంగ్రెస్ ఎప్పుడూ భావించలేదని ఆయన అన్నారు.
కుల ఆధారిత రిజర్వేషన్ వ్యవస్థను ప్రధాని మోదీ వ్యతిరేకించలేదని స్పష్టంగా తెలుస్తోంది. రాజ్యసభలో ప్రతిపక్షాలు లేవనెత్తిన ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందిస్తూ రిజర్వేషన్లకు సంబంధించి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అభిప్రాయాలను ప్రస్తావించారు. అయితే, కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ మాట్లాడుతున్నట్లు వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు.
Claim : A video featuring Prime Minister Modi addressing the issue of caste-based reservations in Parliament is circulating widely
Claimed By : Social Media Users
Fact Check : False