ఫ్యాక్ట్ చెక్: కంగనా రనౌత్ పద్మశ్రీని వెనక్కు తీసుకోమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారా..?

నటి కంగనా రనౌత్‌కు పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకునేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రధాని నరేంద్ర మోదీని అనుమతి కోరుతూ చేసిన ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది.

Update: 2021-11-20 12:39 GMT

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల భారత స్వాతంత్య్రంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! 2014 లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాకనే భారత్ కు అసలైన స్వాతంత్య్రం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1947 నాటి దేశ స్వాతంత్య్రాన్ని ఆమె 'భిక్ష'గా అభివర్ణించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం కొలువుతీరిన 2014 ఏడాదిలోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు భావించాలని ఆమె వ్యాఖ్యానించారు. ఆనాడు భిక్షగా పొందిన దానిని మనం స్వాతంత్య్రంగా ఎలా భావిస్తాం?. దేశాన్ని కాంగ్రెస్‌కు వదిలేసి బ్రిటిషర్లు వెళ్లిపోయారు. బ్రిటిషర్ల పాలనకు మరో కొనసాగింపు రూపమే కాంగ్రెస్‌ అని ఆమె అన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. 1857లోనే మనం తొలిసారిగా స్వాతంత్య్రం కోసం ఐక్యంగా పోరాడాం. కానీ ఆ ఉద్యమాన్ని బ్రిటిషర్లు అణిచివేశారు. దాదాపు శతాబ్దం తర్వాత బ్రిటిషర్లు 'స్వాతంత్య్రం' అనే దానిని భిక్షగా ఇచ్చారు అని ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.

Full View

ఆమెకు ఇటీవల పద్మశ్రీని ఇవ్వగా.. దాన్ని వెనక్కు తీసుకోవాలనే డిమాండ్స్ ఇటీవల విపరీతమయ్యాయి. ఇంతలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కంగనా రనౌత్ పద్మశ్రీని వెనక్కు తీసుకోవాలని కోరినట్లుగా ఓ స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది.


నటి కంగనా రనౌత్‌కు పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకునేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రధాని నరేంద్ర మోదీని అనుమతి కోరుతూ చేసిన ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. ఆమెకు పద్మ అవార్డు ఇవ్వడం నాకు సిగ్గుగా ఉంది! అవార్డును వెనక్కి తీసుకునేందుకు నన్ను అనుమతించాలని కోరుతున్నాను.. అని వైరల్ ట్వీట్ లో ఉంది.

నిజం ఏమిటంటే:

ఈ వైరల్ పోస్టులో ఎటువంటి నిజం లేదు.

ఇది నకిలీ ట్విట్టర్ ఖాతా నుండి వచ్చింది. రామ్ నాథ్ కోవింద్ పేరుతో క్రియేట్ చేసిన మోసపూరిత ట్విట్టర్ ఖాతా నుండి సృష్టించబడిన వైరల్ స్క్రీన్‌షాట్ అని తెలుస్తోంది. కంగనాకు పద్మ అవార్డు ఇవ్వడం తనకు ఇబ్బందిగా ఉందని, దానిని ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నట్లు ఆ వైరల్ స్క్రీన్ షాట్ లో ఉంది.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధికారికంగా ధృవీకరించిన ఖాతాలో కంగనా పద్మశ్రీని వెనక్కు తీసుకోవాలని ఎప్పుడూ చెప్పలేదు. అది నకిలీ ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ అని మేము కనుక్కున్నాము.

'कंगना रनौत द्वारा की गई टिप्पणी देश की भावनाओं को आहत करने वाली है , मै स्वयं उन्हें पद्म पुरस्कार दिये जाने के लिए शर्मिंदगी महसूस कर रहा हूँ ! मेरी सरकार श्री @narendramodi से विनती है कि मुझे पुरस्कार वापस लेने की अनुमति दी जाए।' అంటూ హిందీలో ఆ ట్వీట్ ఉంది.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్విట్టర్ ఖాతా అని చెప్పుకుంటూ ఉన్నది ఒక ఫేక్ ట్విట్టర్ హ్యాండిల్ అని తేలింది. ఆ ట్విట్టర్ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడింది. @rashtrptibhvn హ్యాండిల్ పేరును తనిఖీ చేసినప్పుడు, స్క్రీన్‌షాట్‌లో, అది ఉనికిలో లేదని మరియు Twitter ద్వారా తాత్కాలికంగా నిలిపివేయబడిందని మేము కనుగొన్నాము.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధికారిక ట్విట్టర్ ఖాతా @rashtrapatibhvn ఇది.. దీన్ని ట్విట్టర్ వెరిఫై చేసింది. వైరల్ స్క్రీన్ షాట్ లో ఉన్న అకౌంట్ @rashtrptibhvn కు ఎటువంటి వెరిఫికేషన్ లేదు. కాబట్టి ఇదొక అనధికార ట్విట్టర్ ఖాతా అని.. కావాలనే ఇలాంటి పోస్టులు పెట్టారని తెలుస్తోంది.

ఇక రామ్ నాథ్ కోవింద్ అటువంటి ప్రకటన చేసి ఉంటే తప్పకుండా మీడియా సంస్థలు కథనాలను ప్రచురించి ఉండేవి.. అయితే ఎటువంటి నివేదికలను కూడా మేము గుర్తించలేకపోయాము. ఇదే విషయాన్ని boomlive సంస్థ కూడా ఫ్యాక్ట్ చెక్ చేసి.. అదొక ఫేక్ ట్వీట్ అని తేల్చింది.
కంగనా రనౌత్ పద్మశ్రీని వెనక్కు తీసుకోమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారన్నది అబద్ధమని.. అదొక ఫేక్ అకౌంట్ నుండి వచ్చిన ట్వీట్ అని తెలుస్తోంది.
Claim :  కంగనా రనౌత్ పద్మశ్రీని వెనక్కు తీసుకోమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News