ఫ్యాక్ట్ చెక్: విరాళాల పెట్టెలో నుండి భారీగా నగదు బయటపడుతున్నట్లు చూపుతున్న వీడియో అయోధ్యకు సంబంధించినది కాదు, రాజస్థాన్‌లోని సన్వాలియా సేఠ్ ఆలయంలోనిది
విరాళాల పెట్టెలో నుండి భారీగా నగదు బయటపడుతున్నట్లు చూపుతున్న వీడియో
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలో రామమందిర బాధ్యతలను చూసుకుంటూ ఉంది. అయోధ్య రామ మందిరానికి ఎన్నారైలతో సహా భారతీయుల నుండి లెక్కలేనన్ని కానుకలు, విరాళాలు అందాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు ఆన్‌లైన్‌లో డబ్బును విరాళంగా అందించవచ్చు. అయోధ్య రామమందిర నిర్మాణంలో సహాయం చేయవచ్చు. అయోధ్య రామమందిరం ట్రస్ట్‌కి చేసిన ఈ విరాళాలకు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.
ఆలయ ప్రారంభోత్సవం అనంతరం రామమందిరానికి భక్తుల నుంచి కొన్ని కోట్ల విరాళాలు అందాయి. ఈ వార్తలు వ్యాపించడంతో చాలా మంది డిజిటల్ క్రియేటర్‌లు, సోషల్ మీడియా వినియోగదారులు రామ్ లల్లా విరాళాల పెట్టె పొంగిపొర్లుతోందనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
మొదటి రోజు నుండి అయోధ్య రామ మందిరానికి విరాళాలు వచ్చాయి.. భారీగా వచ్చిన విరాళాల కారణంగా విరాళాల పెట్టెలు పొంగి పొర్లుతూ ఉన్నాయనే వాదనతో వీడియోను అప్లోడ్ చేశారు.
https://www.facebook.com/reel/655640833234804
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము గుర్తించాం.
వివిధ సోషల్ మీడియా ఖాతాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. ఈ వీడియో రాజస్థాన్ రాష్ట్రంలోని చిత్తోర్‌గఢ్‌లో ఉన్న సన్వాలియా సేథ్ ఆలయానికి సంబంధించినది.
సన్వాలియా సేథ్ ఆలయ అధికారిక ఇంస్టాగ్రామ్ పేజీలో డిసెంబర్ 16, 2023న అదే వీడియోను అప్‌లోడ్ చేసింది. వీడియోతో పాటు ఉంచిన క్యాప్షన్ లో విరాళాలకు సంబంధించిన అనేక వివరాలు ఉన్నాయి. ఆ పోస్ట్ ప్రకారం.. 11 డిసెంబర్ 2023న,భగవాన్ సన్వాలియా సేథ్ విరాళాల పెట్టెను తెరిచారు. లెక్కపెట్టగా.. మొత్తం 17కోట్ల 19లక్షల 800 రూపాయలు వచ్చాయి. అలాగే 552 గ్రాముల బంగారు ఆభరణాలు, 16 కేజీల 670 గ్రాముల వెండి ఆలయానికి వచ్చింది. ఇక ట్రస్ట్ ఆఫీస్ డొనేషన్ బాక్స్ 107 గ్రాముల బంగారం, 40 కేజీల 425 గ్రాముల వెండి అందుకుంది.
సవాలియా సేథ్ ఆలయ ప్రధాన పూజారి అయిన నితిన్ వైష్ణవ్ (తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో తెలిపారు) జనవరి 16, 2024న ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. అందులో కూడా ఇవే తరహా వీడియో ఉంది.
ఇటీవలి పవిత్రోత్సవం తర్వాత రామమందిరానికి భారీగా విరాళాలు వచ్చాయని పేర్కొంటూ సోషల్ మీడియా వెబ్‌సైట్‌లలో విస్తృతంగా షేర్ చేసిన వీడియోను మేము చూశాము. విచారణలో.. వీడియో రామాలయం నుండి కాదని, రాజస్థాన్‌లోని శ్రీ సన్వాలియా సేథ్ ఆలయం నుండి వచ్చిందని తేలింది.
చివరగా:
మాకు లభించిన ఆధారాల ప్రకారం.. అయోధ్య శ్రీరాముడి డొనేషన్ బాక్స్ పొంగిపొర్లుతోందనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అవాస్తవమని తేలింది. ఈ వీడియో రాజస్థాన్‌లోని సన్వాలియా సేథ్ దేవాలయానికి సంబంధించినది.
Claim : Donation box of Ayodhya’s Ram Temple overflowing as temple trust gets huge funds on the inaugural day
Claimed By : Social Media Users
Fact Check : False