జూలై 30, 2024 తెల్లవారుజామున భారతదేశంలోని కేరళలోని వయనాడ్ జిల్లాలోని పుంజిరిమట్టం, ముండక్కై, అట్టమల, మెప్పడై, ఇతర గ్రామాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా ఈ విధ్వంసం జరిగింది. బురద, నీరు ఆ ప్రాంతాలను తుడిచిపెట్టేశాయి. వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ఘటన.. కేరళ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటి. 429 మందికి పైగా మరణించారు, 378 మందికి పైగా గాయాలు. 130 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు.
ఇంతలో ఒక చిన్న వీధిలో ఒక వాహనం జస్ట్ అలా రోడ్డు మీద నుండి టర్న్ తీసుకోగా.. కేవలం కొన్ని సెకన్లలో ఆ వీధి భారీ బురద ప్రవాహంతో నిండిపోయింది. వీధి మొత్తాన్ని రాళ్లతో నింపింది. ‘కెరళ వాయనాడ్’ అంటూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఒక సెకండ్ కూడా చాలా విలువైనది’ అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనకు సంబంధించింది కాదు.
మేము వీడియోను జాగ్రత్తగా పరిశీలించగా.. మాకు '@ఘంటా' అనే వాటర్‌మార్క్ కనిపించింది. మేము Instagram ఖాతా కోసం వెతికినప్పుడు, మేము ఆ ఖాతాలో జూలై 28, 2024న అప్లోడ్ చేసిన వీడియోను కనుగొన్నాము. అంటే కేరళలోని వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడటానికి కొన్ని రోజుల ముందు జరిగిన ఘటన అనే క్లారిటీ వచ్చింది.
మేము వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ లో సెర్చ్ చేయగా.. 'భారీ వర్షం తర్వాత అటామి (జపాన్)లో కొండచరియలు విరిగిపడ్డాయి' అనే శీర్షికతో వీడియో ఫేస్‌బుక్ పేజీలో ప్రచురించారని మేము కనుగొన్నాము.
“ Video of debris flow taken by residents of Atami City [landslide]” అనే శీర్షికతో ఆగష్టు 3, 2021న ప్రచురించిన నిడివి ఎక్కువ ఉన్న YouTube వీడియోని మేము కనుగొన్నాము. ఈ వీడియోలో 0.29 సెకన్ల నుండి 0.50 సెకన్ల వరకు వైరల్ అయిన వీడియోను మనం చూడవచ్చు.
JDN అనే పేరున్న ఇజ్రాయెలీ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక కథనం కనుగొన్నాం. జపాన్‌లో భారీ వర్షాల కారణంగా బురద కొట్టుకొచ్చింది. టోక్యోకు నైరుతి దిశలో ఉన్న తీరప్రాంత నగరమైన అటామిలో డజన్ల కొద్దీ ఇళ్లు ధ్వంసమయ్యాయి. రెస్క్యూ దళాలు ఇప్పటి వరకు 20 మంది తప్పిపోయినట్లు నివేదించారు, వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. నగరంలో దాదాపు 2,830 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, నగరంలోని రోడ్లన్నీ మట్టితో నిండిపోయాయి. జపాన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలోని ఒక అధికారి ప్రకారం, తప్పిపోయిన వారి నిజమైన సంఖ్య దాదాపు వందకు పైగా ఉండవచ్చు, ఎందుకంటే సంఘటన జరిగిన సమయంలో ఇళ్లలో ఎంత మంది ఉన్నారనేది ఇంకా తెలియరాలేదు. ఒక ప్రత్యక్ష సాక్షి ఇలా అన్నాడు: "నేను భయంకరమైన శబ్దం విని క్రిందికి దిగగా హిమపాతం కనిపించింది. రెస్క్యూ దళాలు ప్రజలను ఖాళీ చేయమని వేడుకున్నారు, కాబట్టి నేను ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి, భవనం వెలుపల ఉన్న ఇళ్ళు, కార్లు అదృశ్యమయ్యాయి." జూలై 3, 2021 ఉదయం, జపాన్‌లోని షిజుయోకా ప్రిఫెక్చర్‌లోని అటామిలోని ఇజుసాన్ జిల్లాలో ఐజోమ్ నది వద్ద మట్టి, శిధిలాలు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి.ఈ భీభత్సం వల్ల 26 మంది మరణించారు, ఒక వ్యక్తి తప్పిపోయారు, 128 ఇళ్లు దెబ్బతిన్నాయి.
2021 నాటి నుంచీ ఈ వీడియో ఎన్నో సార్లు వివిధ ప్రదేశాలకు చెందినదిగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇటీవల, ఈ వీడియో ఇటలీ కి చెందినది అంటూ ప్రచారం జరిగినప్పుడు, దానిని కొన్ని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు పరిశీలించి తప్పుడు ప్రచారం అంటూ తేల్చి చెప్పాయి.
కాబట్టి, వైరల్ వీడియో వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన కంటే ముందు నుండే ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. ఇక ఆ వీడియో జపాన్ లో చోటు చేసుకుందని స్పష్టంగా తేలింది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.