అంత పెద్ద కార్గో విమానం.. హైదరాబాద్ లో కనపడగానే..!

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఒకటైన ఎయిర్‌బస్ బెలూగా బుధవారం హైదరాబాద్

Update: 2023-08-02 11:55 GMT

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఒకటైన ఎయిర్‌బస్ బెలూగా బుధవారం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. బెలూగా వేల్ ఆకారం భారీగా ఉండడమే కాకుండా.. ఎయిర్ కార్గోను రవాణా చేయగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ విమానాశ్రయం బెలూగాకు ఆతిథ్యమిస్తోందని ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ బుధవారం తెలిపింది. ఈ విమానం ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ కోసం విమానాశ్రయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎనిమిది నెలల్లో ఎయిర్‌బస్ బెలూగా హైదరాబాద్ విమానాశ్రయంలో దిగడం ఇది రెండోసారి.

థాయిలాండ్ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఈ అతిపెద్ద విమానాన్ని చూసి ప్రయాణీకులు ఆశ్చర్యపోయారు. ఈ విమానం ఈరోజు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంది. ఒకేసారి 47 టన్నుల బరువు మోయగల సామర్థ్యం బెలూగా సొంతం. 184 అడుగుల పొడవు, 56 అడుగుల ఎత్తు, ఒక్కో రెక్క వైశాల్యం 2800 చదరపు అడుగులు. విమానం బరువు 86 టన్నులపైగానే ఉంటుంది. బెలూగా కార్గో విమానం తొలిసారిగా 2022 డిసెంబర్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. అప్పట్లో దుబాయ్ లోని మాక్టోం విమానాశ్రయం నుంచి థాయ్ లాండ్ వెళుతూ మార్గమధ్యంలో ఇంధనం నింపుకోవడానికి బెలూగా హైదరాబాద్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ ఆంటోనోవ్ ఏఎన్-225 కూడా 2016లో హైదరాబాద్‌లో దిగింది.


Tags:    

Similar News