తండ్రి అంబులెన్స్ డ్రైవర్.. ఐఐటీలో ర్యాంక్ కొట్టిన కొడుకు
తండ్రి అంబులెన్స్ డ్రైవర్.. ఐఐటీ హైదరాబాద్ లో సీట్;
104 అంబులెన్స్ డ్రైవర్ ఘౌస్ ఖాన్ కుమారుడు అనాస్ ఖాన్ ఐఐటీ లో సూపర్ ర్యాంకు సాధించాడు. ఆల్ ఇండియా లెవల్ లో 1745 ర్యాంక్ సాధించాడు. ఇంత మంచి ర్యాంకు వచ్చిన అతనికి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్‌లో సీటు దక్కనుంది.
హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (HIE)లో అతను ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించాడు. అక్కడే అతడు ఐఐటీలో స్థానం సంపాదించాలని భావించాడు. అది కూడా హైదరాబాద్ ఐఐటీలో అవకాశం దక్కేలా మంచి ర్యాంకు సాధించాలని అనుకున్నాడు. దీంతో అతను IIT ప్రవేశ పరీక్షలకు HIEలో కోచింగ్ తీసుకున్నాడు. అతడిది మధ్య తరగతి కుటుంబం. మహబూబ్‌నగర్‌లో అంబులెన్స్ డ్రైవర్‌గా నెలకు రూ. 17,000 జీతం తీసుకునే తండ్రి. కుటుంబం ఆర్థిక ఇబ్బందులేవీ అనస్ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. బాగా చదివి మంచి ర్యాంకు సాధించి, సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించాడు. ఇంటర్మీడియట్ పరీక్షలలో అతను 94 శాతం స్కోర్ చేశాడు. ఆల్-ఇండియా-EWS ర్యాంక్ 1745 రావడంతో అనుకున్నట్లుగా IIT హైదరాబాద్ లో స్థానం దక్కినట్లే..! మెటలర్జీలో బీటెక్ చేయబోతున్న అనస్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అడుగుజాడలను అనుసరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. పిచాయ్ కూడా IIT ఖరగ్‌పూర్ నుండి మెటలర్జీ ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యాడు.
అనస్ ఖాన్ కు ఘియాసుద్దీన్ బాబుఖాన్ ఛారిటబుల్ ట్రస్ట్ నుండి స్కాలర్ షిప్ లభించింది. ఈ సంస్థ గ్రామీణ, వెనుకబడిన నేపథ్యాల నుండి అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. ఏటా 150 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేస్తుంది. NEET, JEE మెయిన్స్, CA CPT, LAWCET వంటి వివిధ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను తీర్చిదిద్దడానికి సహాయపడుతుంది. తనకు మద్దతుగా నిలిచిన వారికి అనాస్ ఖాన్ అతడి కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.