‌Hyderabad : మూసీ ఒడ్డున కూల్చివేతలు షురూ... మొదలెట్టిన అధికారులు

మూసీని ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేత నేటి నుంచి ప్రారంభమయింది. మూసానగర్ లో కూల్చివేతలు మొదలయ్యాయి.

Update: 2024-10-01 06:15 GMT

 hydra in hyderabad 

మూసీ సుందరీకరణకు సంబంధించి అధికారులు కూల్చివేత పనులను మొదలుపెట్టారు. మూసీ ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాదాపు 1.50 లక్షల రూపాయల వ్యయంతో మూసీ సుందరీకరణ పనుల ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంది. మూసీని ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేత నేటి నుంచి ప్రారంభమయింది. ఈరోజు హైదరాబాద్ లోని మూసానగర్ లో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. మూసీ రివర్ బెడ్ లోనే ఈ కూల్చివేతల ప్రక్రియను అధికారులు ఆరంభించారు. ముందుగానే తాము మార్కింగ్ చేసిన ఇళ్లను కూల్చివేస్తున్నారు. అయితే అక్కడ నివాసముంటున్న వారిని ఒప్పించిన అధికారులు వారికి చంచల్ గూడ ప్రాంతంలో డబుల్ బెడ్ రూంలు కేటాయించారు. నిర్వాసితులు కూడా అంగీకరించడంతో ముందుగా మూసీ నుంచి ప్రక్షాళన మొదలుపెట్టిన అధికారులు అక్కడకు జేసీబీలు వెళ్లలేనంత ఇరుకైన దారులు కావడంతో కూలీలను పెట్టి ఇళ్లను కూల్చివేస్తున్నారు.

సుందరీకరణకు...
నిర్వాసితులు ఇప్పటికే తమ ఇళ్ల నుంచి సామగ్రిని తీసుకెళ్లారు. అనేక మంది డబుల్ బెడ్ రూం ఇళ్లకు తరలి వెళ్లిపోయారు. అయితే కూల్చివేతల సందర్భంగా ఐరన్ తో పాటు ఇతర సామాగ్రిని నిర్వాసితులు తీసుకెళుతున్నారు. నిర్వాసితులకు నచ్చ చెప్పడంలో అధికారులు సక్సెస్ అయ్యారు. దీంతో పాటు డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా వెంటనే కేటాయించడంతో అక్కడకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయడంతోనే ఈ పనులు ప్రారంభమయ్యాయి. మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేసి దానిని సుందరమైన రివర్ బెడ్ గా రూపొందించాలన్నది ప్రభుత్వం ప్రయత్నం. భవిష్యత్ లో మూసీ వరదల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఆక్రమించుకుని నిర్మించిన ఇళ్లకు నోటీసులు అందచేశారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల సానుకూలత వ్యక్తమవుతుంది. అందుకే అనుకూలత వ్యక్తమయిన మూసానగర్ లో తొలుత కూల్చివేతలను ప్రారంభించారు అధికారులు.

Tags:    

Similar News