హైదరాబాద్ లో పాకిస్థానీ.. ఆధార్ కార్డు కూడా!
హైదరాబాద్‌లో పాక్ యువకుడిని పట్టుకోవడం కలకలం రేపుతోంది. మహ్మద్ ఫయాజ్
హైదరాబాద్‌లో పాక్ యువకుడిని పట్టుకోవడం కలకలం రేపుతోంది. మహ్మద్ ఫయాజ్(24)ను బహదూర్‌పురా పోలీసులు అరెస్టు చేశారు. అతడు 2018లో దుబాయ్‌కి వెళ్లి అక్కడ ఓ దుస్తుల దుకాణంలో పనిచేశాడు. 2019లో బహదూర్‌పురా కిషన్‌బాగ్‌కు చెందిన నేహా ఫాతిమా (29) పని కోసం దుబాయ్‌కి వెళ్లింది. ఇద్దరూ ఒకేషాపులో పని చేస్తుండడంతో పరిచయం పెరిగి ప్రేమించుకుని అక్కడే పెళ్లి కూడా చేసుకున్నారు. వారికి మూడేళ్ల బాబు ఉన్నాడు. కొన్నాళ్లకు నేహా ఫాతిమా భారత్‌కు తిరిగొచ్చి కిషన్‌బాగ్‌లో తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఇక దుబాయ్‌లో ఉంటున్న ఫయాజ్‌ను కూడా భారత్‌కు రప్పించి ఇక్కడే దాచారు.
యువతి తల్లిదండ్రులు జుబేర్ షేక్, అఫ్జల్ బేగంలు నేపాల్ (ఖాట్మండు) నుండి ఫయాజ్ ను 2022 నవంబర్‌లో అక్రమంగా భారత్‌కు తీసుకుని వచ్చారు. అక్కడి నుంచి కిషన్‌బాగ్‌కు తీసుకొచ్చారు. మహ్మద్ ఫయాజ్‌ను తమ కుమారుడు గౌస్‌గా పేర్కొంటూ జుబేర్ షేక్, అఫ్జల్ బేగంలు మాదాపూర్‌లోని ఆధార్ కూడా నమోదు చేయించారు. సమాచారమందుకున్న బహదూర్‌పురా పోలీసులు ఫయాజ్‌ను అరెస్టు చేశారు. నిందితుడు అక్రమంగా దేశంలో అడుగుపెట్టడంతో పాటు.. అతడికి ఆధార్ కార్డు కూడా సృష్టించిన అత్తామామలపై కూడా కేసు నమోదు చేశారు. అత్తామామలు జుబేర్ షేక్, అఫ్జల్ బేగంలు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి పాక్ పాస్‌పోర్టు ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.