Hydra : హైడ్రా రెడీ అవుతుందా? ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా?

మొన్నటి వరకూ కూల్చివేతలతో ఒక రేంజ్ లో మార్మోగిపోయిన హైడ్రా మరోసారి బుల్ డోజర్ స్టార్ట్ చేేసేందుకు సిద్దమయింది;

Update: 2024-12-04 11:55 GMT

మొన్నటి వరకూ కూల్చివేతలతో ఒక రేంజ్ లో మార్మోగిపోయిన హైడ్రా మరోసారి బుల్ డోజర్ స్టార్ట్ చేేసేందుకు సిద్దమయింది. డిసెంబరు రెండో వారంలో ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. డిసెంబరు 9వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సమావేశాల్లో హైడ్రా కూల్చివేతల అంశంపై ప్రభుత్వంతో పాటు విపక్షాలు కూడా చర్చించే అవకాశముంది. ప్రభుత్వం కూడా హైడ్రా కూల్చి వేతలపై స్పష్టమైన ప్రకటన చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రా సంస్థను విపక్షాలు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని భావించి సరైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి అధికారులకు హైడ్రాకు సంబంధించిన వివరాలను కూడా ముఖ్యమంత్రి కార్యాలయం కోరినట్లు తెలిసింది. తాజాగా హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వఆస్తుల పరిరక్షణకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి సిద్ధమయింది. వచ్చే నెల నుంచి ప్రతి సోమవారం బుద్ధభవన్ లో ప్రజల నుంచి వినతులను హైడ్రా అధికారులు స్వీకరించనున్నారు. చెరువులు, నాలాలు, పార్క్ ల ఆక్రమణలపై ఎవరైనా ఫిర్యాదుచేయవచ్చని హైడ్రా అధికారులు తెలిపారు.

అసెంబ్లీ సమావేశాల్లో…
ఇప్పటికే హైడ్రాకు విస్తృతమైన అధికారాలను కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో హైడ్రాకు ప్రత్యేక అధికారాలను కట్టబెడుతూ ఆర్డినెన్స్ ను జారీ చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ కూడా దానిని ఆమోదించారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రా బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. హైడ్రాకు పూర్తి స్థాయి అధికారాలు కట్టబెట్టి నగరంలో ఆక్రమణలను తొలగించాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ప్రధానంగా అనేక ఆక్రమణలు తొలగించకుండా ఇంకా ఆగిపోయి ఉన్నాయి. ప్రధానంగా రాజకీయ నేతలకు సంబంధించిన విద్యాసంస్థలు, ఆసుపత్రుల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
న్యాయస్థానాన్ని ఆశ్రయించి…
అయితే న్యాయస్థానాన్ని ముందుగానే ఆశ్రయిస్తూ స్టే ఆర్డర్ లను తెచ్చుకోవడంతో పాటు కూల్చివేతలను న్యాయపరంగా అడ్డుకునే ప్రయత్నాాలు కొందరు చేయడంతో పకడ్బందీగా హైడ్రాను తీసుకు రావాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఉన్నారని తెలిసింది. తొలుత సినీ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ తో ప్రారంభమైన హైడ్రా కూల్చివేతలు తర్వాత వరసగా చెరువులు, కాల్వలు, నల్లాలు ఆక్రమించుకుని నిర్మించుకున్న వాటిని కూలగొట్టారు. ప్రత్యేకంగా తెప్పించిన బుల్డోజర్ తో పెద్ద పెద్దభవనాలను కూడా కూల్చివేశారు.దీంతో హైదరాబాద్ లో ఒక రకంగా భయానకమైన వాతావరణం నెలకొంది.
ఆక్రమణలును కూల్చివేస్తూ…
ఎఫ్.టి.ఎల్,బఫర్ జోన్ పరిధిలో ఉన్న వాటినికూల్చివేస్తున్నామని హైడ్రా అధికారులు చెబుతున్నప్పటికీ హైడ్రాకు ఉన్న చట్టబద్ధతను న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో దానికి పూర్తి స్థాయి అధికారాలను కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమయింది. గతంలో అనుకున్నట్లుగానే అన్ని ఆక్రమణలను తొలగించి హైదరాబాద్ ను వరదనీటి ముప్పు నుంచి రక్షించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది. అయితే ఇటీవలకాలంలో హైడ్రా కొంత కూల్చివేతల విషయంలో నాన్చివేత ధోరణి చూపుతుండటంతో అనేక విమర్శలు ప్రజల నుంచి కూడా వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి హైడ్రా కూల్చివేతలు ఒక కారణమన్న కామెంట్స్ వినిపించాయి.అయితే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రాకు పూర్తి స్థాయి అధికారాలను కట్టబెట్టిన తర్వాత వచ్చే వేసవి నాటికల్లాకూల్చివేతలను పూర్తి చేయాలన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.సో.. హైడ్రా మళ్లీ జూలు విదల్చనుంది. ఆక్రమణదారులూ పారాహుషార్.






Tags:    

Similar News