టాలీవుడ్ ను చిదిమేస్తున్న పైరసీ.. పెద్ద సినిమాలకూ తప్పని బెడద !
సినిమా ఇలా విడుదలవుతుందో లేదో.. అలా ఆన్ లైన్ లోకి వచ్చేస్తోంది. థియేట్రికల్ ప్రింట్ కూడా కాదు. ఫుల్ హెచ్ డీ ప్రింట్ తో..
2020 నుంచి టాలీవుడ్ ను కరోనా భూతం పట్టి పీడిస్తోంది. 2021లో కాస్త పర్వాలేదు.. అనుకుంటూ పెద్ద సినిమాలు విడుదలకు రెడీ అవుతున్న సమయంలో మరోసారి పంజా విసిరింది కరోనా. అసలే అంతంత మాత్రం రిలీజ్ లు. ఏడాదిలో సగం రోజులు థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీలతోనే నడిచాయి. సినిమాకు పెట్టిన బడ్జెట్ అయినా వసూలైతే చాలనుకుంటున్నారు నిర్మాతలు. ఇలాంటి క్లిష్ట సమయంలో.. చిన్న, పెద్ద సినిమాలపై పైరసీ ఉక్కుపాదం మోపుతోంది.
Also Read : మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు
సినిమా ఇలా విడుదలవుతుందో లేదో.. అలా ఆన్ లైన్ లోకి వచ్చేస్తోంది. థియేట్రికల్ ప్రింట్ కూడా కాదు. ఫుల్ హెచ్ డీ ప్రింట్ తో.. సినిమాలను ఇల్లీగల్ గా ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నాయి పలు వెబ్ సైట్లు. ఫలితంగా కలెక్షన్లు పడిపోతున్నాయి. సినిమాలే కాదు.. ఓటీటీల్లో విడుదలవుతున్న వెబ్ సిరీస్ లను కూడా వదలడం లేదు పైరసీ బాబులు. ఫలితంగా ఓటీటీ సంస్థలకు కూడా కనిపించని నష్టం వాటిల్లుతోంది.
IBOMMA అనే వెబ్ సైట్ ను చూస్తే.. సినిమాల పైరసీ ఏ రేంజ్ లో జరుగుతోందో తెలుస్తుంది. తెలుగు, తమిళం, మళయాళం, హాలీవుడ్ ఇలా.. ఫలానా ఇండస్ట్రీ అని కాకుండా.. అన్ని భాషల సినిమాలను ఫుల్ హెచ్ డీ క్లారిటీతో విడుదల చేస్తున్నారు. సినిమాలు థియేటర్లలో ఆడుతుండగానే.. పైరసీ చేయడం వల్ల పలువురు నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. పుష్ప, అఖండ వంటి పెద్ద సినిమాలకూ ఈ బెడద తప్పలేదు.
Also Read : నేటి నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ
పుష్ప, వరుడు కావలెను, లక్ష్య, స్కైలాబ్, రాజా విక్రమార్క, అనుభవించు రాజా, కొండపొలం, పుష్పకవిమానం, మంచిరోజులొచ్చాయి, రిపబ్లిక్ తదితర సినిమాలు IBOMMA వెబ్ సైట్ లో పైరసీ అయ్యాయి. అలాగే ఓటీటీల్లో విడుదలైన త్రీ రోజెస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్, దృశ్యం -2, డబ్య్లూడబ్ల్యూడబ్ల్యూ వంటి సినిమాలు కూడా సదరు వెబ్ సైట్ లోకి వచ్చేశాయి. ఇలా ఇల్లీగల్ గా సినిమాలను, వెబ్ సిరీస్ లను పైరసీ చేస్తున్న వెబ్ సైట్లపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పైరసీ వెబ్ సైట్ల వల్ల ఇండస్ట్రీకి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాపోతున్నారు.