Sabarimala: శబరిమలకు వెళ్లాలని అనుకుంటున్నారా.. ఈ విషయం తెలుసుకోండి!!

శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుండి భారీ ఎత్తున వెళుతూ ఉంటారు

Update: 2024-10-05 16:56 GMT

శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుండి భారీ ఎత్తున వెళుతూ ఉంటారు. ఇక కార్తీక మాసం మొదలైందంటే  అయ్యప్ప స్వాములు శబరిమలకు పోటెత్తుతారు. శబరిమలలో నవంబర్‌లో ప్రారంభమయ్యే రెండు నెలల మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర విషయంలో కేరళ అధికారులు కీలక ప్రకటన చేశారు. అయ్యప్ప స్వామి ఆలయంలో రోజుకు గరిష్టంగా 80,000 మంది భక్తులను అనుమతిస్తామని, ఈ ఏడాది భక్తులను ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతిస్తామని కేరళ ప్రభుత్వం శనివారం తెలిపింది.

సన్నాహాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అటవీ మార్గంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని కేరళ ప్రభుత్వం తెలిపింది. రద్దీ సమయాల్లో వాహనాలను క్రమబద్ధీకరించాలని, అవసరమైతే పార్కింగ్‌కు మరిన్ని ప్రాంతాలను గుర్తించి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. ‘విశుధి సేన’ వాలంటీర్లకు (పరిశుభ్రత వాలంటీర్లు) ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన శిక్షణ కూడా ఇవ్వనున్నారు. శబరిమలలోని శబరి అతిథి గృహం నిర్వహణ త్వరలో పూర్తవుతుందని, ప్రణవం అతిథి గృహం పునరుద్ధరణ ఇప్పటికే పూర్తయిందని అధికారులు తెలిపారు.

శబరిమలకు వెళ్లే భక్తుల్లో ఎక్కువ భాగం తెలుగు వాళ్ళే ఉంటారు. ప్రతీ ఏడాది కొత్త కొత్త సమస్యలను అయ్యప్ప స్వాములు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యలు ఉన్నాయి అని చెబుతున్నా కూడా సదుపాయాలను మెరుగుపరచడంలో కేరళ ప్రభుత్వం విఫలమవుతూ వస్తోంది. ఎన్నో ఏళ్లుగా శబరిమలకు వెళుతున్న అయ్యప్పలకు ఈ ఏడాది అయినా సరైన సదుపాయాలను అధికారులు కల్పించి ఉంటారో లేదో చూడాలి. 

Tags:    

Similar News