పాపం.. బైక్ మీద నుండే రోడ్డు వేశారు
రోజూ ఇంటి ముందే బైక్ పార్క్ చేసి పెట్టుకుంటానని యజమాని మురుగన్ చెప్పారు.
తమిళనాడు రాష్ట్రం వెల్లూరులో రోడ్లను వేస్తూ ఉండగా.. ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వీధిలో రోడ్లపై బైక్స్ ను ఉంచగా.. కాంక్రీటులో ఆ ద్విచక్ర వాహనం చక్రాలు ఇరుక్కుపోయాయి. ఈ సంఘటనకు సంబంధించిన ఛాయాచిత్రాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.
వెల్లూర్ మున్సిపాలిటీలోని గాంధీ రోడ్ ప్రాంతంలో ఎస్. మురుగన్ ఇంటి ముందు సిమెంట్ (సీసీ) రోడ్డు వేశారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ అలా ఉండగానే సిమెంట్ కాంక్రీట్ నింపేశారు. దానితో బైక్ ముందు, వెనక టైర్లు, స్టాండ్ ఆ సిమెంట్ రోడ్డులో చిక్కుకుపోయాయి. రోజూ ఇంటి ముందే బైక్ పార్క్ చేసి పెట్టుకుంటానని యజమాని మురుగన్ చెప్పారు. అదే తరహాలో ఇంటి ముందు బైక్ పెట్టానని పేర్కొన్నారు. తాను ఇంట్లోనే ఉన్నానని.. కనీసం పిలవకుండానే బైక్ ను అలాగే ఉంచి రోడ్డు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్ కు తాము అనుమతే ఇవ్వలేదని.. రోడ్డు ఎలా వేశారని కమిషనర్ ప్రశ్నించారు. సదరు కాంట్రాక్టర్ కు నోటీసు జారీ చేశామని.. తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పుకొచ్చారు. కార్పొరేషన్ నుంచి ఎలాంటి సమాచారం లేకుండానే కాంట్రాక్టర్ స్థానికులతో కలిసి రోడ్డు వేశారు. ఈ సంఘటనపై ఇంజనీర్ (జోన్-II)కి షోకాజ్ నోటీసు జారీ చేయబడింది. ఈ సంఘటన స్థలాన్ని సందర్శించామని.. మోటార్ సైకిల్ ఇరుక్కున్న ప్రదేశం నుండి తీసివేయబడిందని కమిషనర్ కుమార్ తెలిపారు.