కేంద్రం 'రాఖీ' కానుక.. రూ.200 తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధర
గ్యాస్ సిలిండర్లపై రూ.200 సబ్సిడీ ఇవ్వాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
గ్యాస్ సిలిండర్లపై రూ.200 సబ్సిడీ ఇవ్వాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో గ్యాస్ సిలిండర్ల వినియోగదారులందరికీ ధరల్లో రూ.200 వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. అయితే.. ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రం రూ.200 అదనపు సబ్సిడీ లభిస్తుంది. అంటే గ్యాస్ సిలిండర్ పై రూ.400 తగ్గింపు ఉంటుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లపై ప్రజలకు ప్రత్యేకంగా రూ.200 సబ్సిడీ ఇస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. అంటే వారికి మొత్తం రూ.400 సబ్సిడీ లభిస్తుంది. మాములు వినియోగదారులందరికీ రూ.200 సబ్సిడీ వర్తిస్తుందని పేర్కొన్నారు.
రక్షాబంధన్ సందర్భంగా 75 లక్షల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ప్రకటించారు. గ్యాస్ సిలిండర్లు మరోసారి చౌకగా మారాయని.. దేశంలోని కోట్లాది మంది సోదరీమణులకు ప్రధాని రాఖీ, ఓనమ్ కానుకలను అందించామని అన్నారు. అంతకుముందు ఆగస్టు 1న పెట్రోలియం కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను రూ.100 తగ్గించాయి.
ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. చంద్రయాన్ మిషన్ 3 విజయం దేశంలో, ప్రపంచంలో మన స్థాయిని పెంచిందన్నారు. ఈ విజయం భారత్ ప్రగతికి నిదర్శనం. ఇకపై ఆగస్టు-23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశం భారతదేశం. చంద్రయాన్ 3తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ మంత్రివర్గం అభినందించింది.