Mamata Banerjee: ఏపీ సీఎం చంద్రబాబుకు ఇచ్చిన అవకాశంపై మమతా ఫైర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు మాట్లాడడానికి చాలా సమయం ఇచ్చారు కానీ.. తనకు మాత్రం అసలు అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు మమతా బెనర్జీ. తన మైక్ మ్యూట్ చేశారని.. ఐదు నిమిషాలకు మించి మాట్లాడేందుకు అనుమతించలేదని ఆగ్రహించిన ఆమె సమావేశం నుండి బయటకు వచ్చేసారు. ఢిల్లీలో జరిగిన సమావేశానికి ప్రతిపక్ష పాలిత రాష్ట్రం నుండి హాజరైన ఏకైక ముఖ్యమంత్రి బెనర్జీ.. పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర నిధులు తక్కువ ఇచ్చిన అంశాన్ని ప్రస్తావిస్తే తన మైక్ మ్యూట్ చేశారని తెలిపారు.
"నన్ను ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడేందుకు అనుమతించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడేందుకు 20 నిమిషాల సమయం ఇచ్చారు. అస్సాం, గోవా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు 10-12 నిమిషాలు మాట్లాడారు. అందుకే నేను నా నిరసనను వ్యక్తం చేసి బయటకు వచ్చాను" అని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మీడియాతో చెప్పారు. పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని నేను మాట్లాడుతున్నాను.. అప్పుడే సరిగ్గా నా మైక్‌ను మ్యూట్ చేశారని బెనర్జీ అన్నారు. ఈ చర్యను బెంగాల్, అన్ని ప్రాంతీయ పార్టీలకు అవమానమన్నారు.