Nitish Kumar L నితీష్ లో "నీతి" ఎంత?.. ఇన్ని సార్లు కప్పగంతులా..? ఏ పొలిటీషియన్‌ హిస్టరీలో లేదేమో?

రాజకీయ నాయకుడు అంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లాగా ఉండాలని అందరూ భావిస్తారు.

Update: 2024-01-26 04:42 GMT

రాజకీయ నాయకుడు అంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లాగా ఉండాలని అందరూ భావిస్తారు. ఆయన నిజాయితీ.. నిబద్ధత.. నీతి అందరికీ ఆదర్శమని చెప్పేవారు. కానీ అది మొన్నటి వరకూ రాను... రాను.. రాజకీయ రంగంలో నితీష్ కుమార్ అంటే ఇతను కూడా సాదా సీదా పొలిటీషియన్ అని చెప్పుకోక తప్పదు. ఒకప్పుడు దేశ ప్రధాని పదవికి ఎవరి పేరంటే నితీష్ కుమార్ పేరు వినిపించేది. ఇప్పుడు ఆయన తన పై ప్రజల్లో ఉన్న గౌరవాన్ని ఆయనంతట ఆయనే కోల్పోయేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లుంది. చేజేతులా ఉన్న మంచి పేరును చెడిపేసుకుంటున్న నితీష్ కుమార్ ఇప్పుడు దేశ రాజకీయాలకు కాదు.. బీహార్ పాలిటిక్స్ కు కూడా పనికివస్తారా? అన్న ప్రశ్నలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి.

అవినీతి మచ్చ లేకపోయినా...
బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నిజాయితీ పరుడే. దానిని ఎవరూ కాదనలేరు. ఆయన రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ లేదు. ఆయన పాలన కూడా ప్రజారంజకంగానే ఉంటుంది. బీహార్ లో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు కూడా సాధించారు. అయితే ఆయన రాజకీయ నిర్ణయాలే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎటు గాలి ఉంటే అటు వెళ్లిపోయే లీడర్ గా ఆయన పేరు పొందారు. ఆయనకు పదవి ముఖ్యం. పార్టీలను మారుస్తూ తన కుర్చీని మాత్రం పదిలం చేసుకుంటున్నాడన్న విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఇది ఆయన రాజకీయ జీవితానికి మంచిది కాకపోయినా ఆయనకు పదవే ముఖ్యంలా కనిపిస్తుంది.
పొత్తులు ఒకసారి...
ఒకసారి బీజీపీ అంటారు.. మరొకసారి కాంగ్రెస్ కూటమి అంటారు.. శరద్ యాదవ్ స్థాపించిన జనతాదళ్ యు ను తన సొంతం చేసుకుని ఆయననే బయటకు వెళ్లగొట్టగలిగారు. ఒకసారి అయితే సర్లే అనకోవచ్చు. ఇన్నిసార్లు.. ఇన్ని నిర్ణయాలు.. బీహార్ లో వీస్తున్న గాలులను బట్టి ఆయన నిర్ణయాలు ఉంటాయి. పొత్తులు ఉంటాయి. తాను అవినీతికి వ్యతిరేకం అంటూనే అవినీతి కేసుల్లో కూరుకుపోయిన లాలూప్రసాద్ యాదవ్ కుటుంబ పార్టీ ఆర్జేడీతో నిర్భయంగా పొత్తు పెట్టుకుంటారు. అవసరం లేనప్పుడు మాత్రం లాలూ కుటుంబ అవినీతిని ఎండగడతారు. లేకుంటే లాలూయాదవ్ అంత మంచోడు లేడంటూ ఆలింగనం చేసుకునేదీ ఈయనే.
మళ్లీ బీజేపీ గ్రూపులోకి...
తాజాగా మరోసారి బీహార్ రాజకీయాలు మారుతున్నాయి. ఎనిమిది సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఎక్కువ కాలం ఉండరు. తన ప్రభుత్వాన్ని రద్దు చేయడం ఆయనకు అలవాటు. 2022లో బీజేపీతో పొత్తును తెగదెంపులు చేసుకుని ఆయన కాంగ్రెస్ కూటమిలో చేరిపోయి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్లీ జంప్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన జంప్ కావడమే కాదు ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. తిరిగి ఎన్డీఏ కూటమిలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలు ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. అయితే ఈసారి గణాంకాలు ఆయన రాజీనామా చేసినా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. లాలూ ఇప్పటికే రంగంలోకి దిగి ప్రభుత్వం పడిపోకుండా ఉండేందుకు అవసరమైన సంఖ్య కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక మనిషి రాజకీయంగా ఇన్నిసార్లు గోడ దూకుళ్లు చేసిన వాళ్లు చరిత్రలో ఉండే అవకాశం కలగకపోవచ్చు. మరి నితీష్ కుమార్ కు అదృష్టం కలసి వస్తుందో ఏమో కాని జంప్ చేసినప్పుడల్లా సీఎం కుర్చీ మాత్రం అందుతూనే ఉంది. మరి ఈసారి ఏం జరుగుతుందో?


Tags:    

Similar News