బీజేపీని టెన్షన్ పెట్టడానికి మరోసారి ఉద్యమం

భారతీయ జనతా పార్టీని మరోసారి ఇరుకున పెట్టడానికి రైతు సంఘాలు ఫిక్స్ అయ్యాయి;

Update: 2024-07-13 04:51 GMT

భారతీయ జనతా పార్టీని మరోసారి ఇరుకున పెట్టడానికి రైతు సంఘాలు ఫిక్స్ అయ్యాయి. మళ్లీ రైతు ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. 2020-21లో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టిన రైతు సంఘాల ఐక్య వేదిక 'సంయుక్త కిసాన్‌ మోర్చా' ఇటీవలే సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో రైతుల సమస్యలపై పోరాడడానికి మరోసారి ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. కనీస మద్దతు ధర, రుణమాఫీ, రైతుకూలీలకు పింఛన్లు, విద్యుత్ ప్రైవేటీకరణను నిలిపివేయడం వంటి పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై తమ ఆందోళనను తిరిగి ప్రారంభిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. తమ డిమాండ్ల గురించి తెలియజేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కలవడానికి కూడా అపాయింట్‌మెంట్‌లు కోరుతామని సంయుక్త కిసాన్‌ మోర్చా తెలిపింది.

జూలై 16 నుంచి 18 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఎంపీలందరినీ కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించనున్నట్టు రైతులు సంఘాల నేతలు తెలిపారు. ఉద్యమం సమయంలో మరణించిన అన్నదాతల గౌరవార్థం ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రి, సింఘు వద్ద స్మారకాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 9న ‘క్విట్‌ ఇండియా డే’ను ‘కార్పొరేట్స్‌ క్విట్‌ ఇండియా డే’గా నిర్వహిస్తామని, దేశవ్యాప్తంగా తమ డిమాండ్ల సాధనకు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి భారత్‌ బయటకు రావాలని, వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ సంస్థలను అనుమతించవద్దని ఈ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొత్త పద్ధతుల్లో ఉద్యమాన్ని నడిపించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. తమ ప్రచారం వల్లే బీజేపీ లోక్‌సభలో 63 సీట్లు కోల్పోయిందని సంయుక్త కిసాన్‌ మోర్చా సభ్యులు చెప్పారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌, జమ్ము కశ్మీర్‌, హర్యానా రాష్ట్రాలపై ప్రధాన దృష్టి సారిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగించి మహాపంచాయత్‌లను నిర్వహిస్తామని రైతుల సంఘం తేల్చి చెప్పింది. రైతు సంఘాల నేతల ఈ ప్రకటన అధికారంలోని ఎన్.డి.ఏ. కూటమిని టెన్షన్ పెట్టనున్నాయి.


Tags:    

Similar News