అలర్ట్.. దేశంలో 9 రాష్ట్రాలకు పొంచి ఉన్న వరద ముప్పు
తాజాగా.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో.. 9 రాష్ట్రాలకు వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ..
నైరుతి రుతుపవనాల రాకతో.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ శాఖలు వెల్లడించాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తాజాగా.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో.. 9 రాష్ట్రాలకు వరద ముప్పు పొంచి ఉందని వాతవరణ విభాగం హెచ్చరించింది. ఒడిశా తీరానికి దగ్గరగా ఏర్పడిన ఈ అల్పపీడనం ప్రభావంతో.. మహారాష్ట్ర,కర్ణాటక తీరప్రాంతాలతో పాటు ఒడిశా, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీలలో, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రానున్న ఏడు రోజుల్లో భారీ వర్షాలు కురవనుండగా.. గోదావరి, మహానది నదులకు వరద పోటెత్తుతుందని హెచ్చరించింది. ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతాయని ఐఎండీ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ కేంద్రాలు హెచ్చరించాయి. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.