Ratan Tata : రతన్ టాటాకు ప్రముఖుల ఘన నివాళులు
పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల అనేక మంది రాజకీయ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల అనేక మంది రాజకీయ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ అనేక మంది నేతలు, వ్యాపారవేత్తలు ఆయన మృతికి సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మృతి పారిశ్రామిక రంగానికి మాత్రమే కాకుండా, సేవా రంగానికి కూడా తీరని లోటు అని అనేక మంది అభిప్రాయపడ్డారు. ఆయన కంపెనీల బ్రాండ్‌ల వస్తువులు ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ ఉన్నాయంటూ, ఆయనను స్మరించుకున్నారు.
విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా అని ఏపీమంత్రి నారా లోకేష్ అన్నారు. దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిబద్ధతతో నిర్వహించిన పద్మవిభూషణ్ రతన్ టాటా సేవలు చిరస్మరణీయమన్నారు. . టాటా గ్రూప్ ఉత్పాదనలు వాడని భారతీయులు ఉండరని, మన దేశంలో ఏ మూల ఏ విపత్తు సంభవించినా భారీ విరాళంతో స్పందించే మానవత్వపు హృదయం రతన్ టాటా అని కొనియాడారు.
టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటాకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన ఓ లెజెండ్ అని టాటా ఉత్పత్తులను ఉపపయోగించని రోజును ఊహించుకోలేమని దర్శకుడు రాజమౌళి తెలిపారు. పంచభూతాలతో పాటు ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారని అభిప్రాయపడ్డారు. తరతరాలకు స్ఫూర్తినిచ్చారని, ఎప్పటికీ ఆయనకు నేను ఆరాధకుడినే నంటూ రాజమౌళి నివాళులర్పించారు.
రతన్ టాటా లేరన్నది తాను అంగీకరించలేకపోతున్నానని, మన ఆర్థిక సంపద, విజయాలకు ఆయన సేవలు ఉపయోగం ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా అన్నారు.
రతన్ టాటా మరణం పట్ల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంతాపం తెలిపారు. రతన్ టాటా వ్యాపారరంగంలో అసాధరణ సేవలు అందించారని సుందర్ పిచాయ్ అన్నారు.
దేశం పారిశ్రామిక దిగ్గజాన్ని కోల్పోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. రతన్ టాటా ఇక లేరన్న విషయం పారిశ్రామిక రంగం శోకసంద్రంలో మునిగి పోయిందన్నారు. భారత దేశం విలువ లతో కూడిన పారిశ్రామిక దిగ్గజాన్ని కోల్పోయిందని,ఆంధ్రప్రదేశ్ బిజెపి విచారాన్ని వ్యక్తం చేసింది
ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతిపట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. దేశ పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్ రతన్ టాటా అంటూ జగన్ కొనియాడారు. సమాజ సేవలను అందించడానికి రతన్ టాటా ఎనలేని కృషి చేశారన్న జగన్ దేశ నిర్మాణానికి ఆయన సహకారం ఎవరూ మరవలేనిదన్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి దేశ పారిశ్రామిక రంగానికి తీరని లోటని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్న రేవంత్ రెడ్డి ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త నడవాలన్నారు. చిన్న పారిశ్రామికవేత్తలకు ఆయన ఒక స్ఫూర్తి అని రేవంత్ రెడ్డి అన్నారు. అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
రతన్ టాటా మృతి పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. రతన్ టాటా అరుదైన పారిశ్రామికవేత్త అని అన్నారు. ప్రపంచ ఆర్థిక,పారిశ్రామికరంగానికి రతన్ టాటా దిక్సూచి అని కేసీఆర్ కొనియాడారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త అని కేసీఆర్ అన్నారు.