నైరుతి రుతుపవనాల ఆగమనం అప్పడే.. వెల్లడించిన ఐఎండీ
సాధారణంగా జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి. ఈసారి నాలుగు రోజులు ఆలస్యంగా.. జూన్ 4 నాటికి కేరళలోకి
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో మాడు పగిలే ఎండలు కాస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం అసలిదే వేసవికాలమేనా అనిపించేలా వర్షాలు కురవగా.. ఇప్పుడు ఎండలు భయపెడుతున్నాయి. వేడిగాలులు, విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాజాగా భారత వాతావరణ విభాగం.. నైరుతి రుతుపవనాల కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కానుంది.
సాధారణంగా జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి. ఈసారి నాలుగు రోజులు ఆలస్యంగా.. జూన్ 4 నాటికి కేరళలోకి వచ్చే అవకాశాలున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ వర్షపాతం అందిస్తాయని ఐఎండీ తెలిపింది. భారత్ లోకి రుతుపవనాలు ప్రవేశించాక ఎంత వేగంగా విస్తరిస్తే అంత వర్షపాతం ఉంటుందని, ఆలస్యంగా విస్తరిస్తే వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఐఎండీ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది దేశంలో 96 శాతం వర్షపాతం నమోదుకానున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా నైరుతి రుతుపవనాలు వచ్చేంత వరకూ ఈ మండుటెండలు తప్పేలా లేవు.