హిమంత బిశ్వ శర్మ నిర్ణయం.. దేశమంతా అమలుపరిస్తే ఎంత బాగుంటుంది?
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశమంతా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. జులై నుంచి ఉన్నతాధికారులు, మంత్రులు తమ విద్యుత్తు బిల్లులను తామే చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. తనతో పాటు చీఫ్ సెక్రటరీ కూడా జులై ఒకటో తేదీ నుంచి తాము వినియోగించే విద్యుత్తు బిల్లులను తామే చెల్లించనున్నామని హిమంత బిశ్వశర్మ తెలిపారు. మంత్రులు, ఉన్నతాధికారులు తమ నివాసాలకు వినియోగించే విద్యుత్తు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తుంది.
వాళ్లే చెల్లించేలా...
ప్రజలు చెల్లించే పన్నుతో ప్రజాసేవ చేసే వారికి ఎలా వినియోగిస్తారన్న ప్రశ్నకు హిమంత శర్మ తన చర్యల ద్వారా జవాబిచ్చినట్లయింది. ప్రభుత్వానికి ప్రజలు చెల్లించే పన్నుల సొమ్ముతో ప్రభుత్వ అధికారులకు, మంత్రులకు విద్యుత్తు బిల్లులు చెల్లించబోమని ఆయన స్పష్టంచేశారు. దీనివల్ల విద్యుత్తును ఆదా చేయడమే కాకుండా, ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. హిమంత బిశ్వ శర్మ నిర్ణయం దేశంలోని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.