Bhole Baba : భోలే బాబా పోలీసులు కన్ను గప్పి భలే తిరుగుతున్నాడుగా?
ఉత్తర్‌ప్రదేశ్ లో భోలే బాబా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఉత్తర్‌ప్రదేశ్ లో భోలే బాబా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటవీల తొక్కిసలాటలో 121 మంది మరణించడానికి కారణమైన భోలే బాబాను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అయితే ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ భోలే బాబా పేరు అందులో లేకపోవడం విమర్శలకు దారి తీస్తుంది. భోలే బాబాను రక్షించడానికే పోలీసులు ప్రయత్నిస్తున్నారని అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. భోలే బాబా కారణంగానే ఇంత మంది మృత్యువాత పడటానికి కారణమని అందరూ చెబుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి.
ఆశ్రమంలో ఉన్నాడని...
భోలే బాబా నిరామ్ కుటీర్ ఛారిటబుల్ ఆశ్రమంలో భోలే బాబా ఉన్నట్లు పెద్దయెత్తున ప్రచారం జరిగింది. అయితే అక్కడకు వెళ్లిన పోలీసులకు భోలే బాబా ఆచూకీ లభించలేదు. ఆశ్రమంలో నలభై నుంచి యాభై మంది వరకూ బాబా సేవకులున్నారు. వారు కూడా భోలే బాబా ఆచూకీ గురించి తమకు తెలియదని చెబుతున్నారు. తాము ఘటన జరిగిన తర్వాత భోలే బాబాను చూడలేదని చెబుతున్నారు. అయితే భోలే బాబా కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
రాజస్థాన్ వెళ్లినట్లు...
భోలే బాబా మాత్రం తాను ఆధ్యాత్మిక కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయానని, ఆ తర్వాతనే అక్కడ తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. కానీ భోలే బాబా అక్కడ ఉన్నప్పుడే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే భోలేబాబా రాజస్థాన్ వెళ్లినట్లు చెబుతున్నారు. భోలే బాబా అసలు పేరు జగత్ గురు సాకార్ విశ్వహరి. అతను గతంలో ప్రభుత్వోద్యోగం చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు మళ్లాడు. అనంతరం పెద్దయెత్తున భక్తులను సంపాదించుకున్నాడు. తర్వాత ఆశ్రమాలను నెలకొల్పి తరచూ ఇలాంటి ఈవెంట్లను చేస్తుంటారని చెబుతున్నారు. మొత్తం మీద భోలే బాబా కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.