అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు కాల్స్.. ఒకరు అరెస్ట్
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ, ఆయన కుటుంబాన్ని చంపేస్తామంటూ..
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ, ఆయన కుటుంబాన్ని చంపేస్తామంటూ నేడు తరచూ బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నెంబర్ కు నేడు ఎనిమిది బెదిరింపు కాల్స్ వచ్చాయి. దాంతో అప్రమత్తమైన ఫౌండేషన్ అధికారులు వెంటనే ముంబైలోని డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రిలయన్స్ ఫౌండేషన్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బెదిరింపు కాల్స్ ఆధారంగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఒకే నంబర్ నుంచి నాలుగుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నంబర్ లొకేషన్ ఆధారంగా ముంబై వెస్ట్ సబర్బ్ ప్రాంతంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తే 8 సార్లు బెదిరింపు కాల్స్ చేశాడా ? లేక వేర్వేరు వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయా ? అన్న విషయం తెలియాల్సి ఉంది. గతంలో ముఖేశ్ అంబానీ నివాసం ఎదుట పేలుడు పదార్థాలతో నింపిన స్కార్పియో వాహనం పార్క్ చేసి ఉండటం కలకలం రేపిన సంగతి తెలిసిందే.