Salman Khan: నన్ను చంపడానికి ప్రయత్నించారని నమ్ముతున్నా: సల్మాన్ ఖాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం ఉన్న సంగతి తెలిసిందే. ఆయన్ను చంపడానికి కొన్ని గ్యాంగ్ లు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ను చంపేయాలని చేయని ప్రయత్నాలు అంటూ లేవు. సల్మాన్ ఖాన్ ను ఆయన ఫామ్ హౌస్ దగ్గర కానీ.. లేదా ఇంటి దగ్గర కానీ చంపేయాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నించింది. దీంతో ప్రభుత్వం సల్మాన్ ఖాన్ కు సెక్యూరిటీని కూడా పెంచేసింది.
తనను, తన కుటుంబాన్ని హతమార్చేందుకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన ఇంటి బయట కాల్పులు జరిపాడని నమ్ముతున్నానని సల్మాన్ ఖాన్ అన్నారు. గత నెలలో ముంబై క్రైమ్ బ్రాంచ్‌లోని యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ సల్మాన్ ఖాన్ వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. 1,735 పేజీల ఛార్జిషీట్ లో సల్మాన్ ఖాన్ తనకు, తన కుటుంబానికి లారెన్స్ బిష్ణోయ్, అతని ముఠా సభ్యుల నుండి వచ్చిన బెదిరింపుల వివరాలను పంచుకున్నారు. తన కుటుంబ సభ్యులు, బంధువులు అప్రమత్తంగా ఉండాలని కోరినట్లు తెలిపారు. ఏప్రిల్ 14 తెల్లవారుజామున తాను నిద్రిస్తున్న సమయంలో కాల్పులు జరిగినట్లు సల్మాన్ వెల్లడించారు.
తన కుటుంబ సభ్యులు, బంధువులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తాను కోరానని, ముంబై పోలీసులు తనకు 'వై' ప్లస్ భద్రతను అందించారని సల్మాన్ చెప్పారు. ఏప్రిల్ 14న బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పాల్గొన్న షూటర్లు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌లను గుజరాత్‌లో అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేయగా, వారిలో ఒకరైన అనూజ్ థాపన్ మే 1న పోలీసు కస్టడీలో ఉరి వేసుకున్నాడు.
సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిపై ముంబై పోలీసులు 1,500 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. నటుడిని చంపడానికి రూ. 25 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చారని, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో భాగమైన నిందితులు అతన్ని చంపడానికి ఆధునిక ఆయుధాలు సంపాదించాలని ప్లాన్ కూడా చేసుకున్నారు. కాల్పుల ఘటనకు సంబంధించి లారెన్స్ బిష్ణోయ్, అతని తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ సహా 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు.