ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీం నోటీసులు
అవినాష్ ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు. సునీత పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం..
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్యకేసులో A8గా ఉన్న అవినాష్ రెడ్డికి మే 31న తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ ముందస్తు బెయిల్ ను సవాల్ చేస్తూ.. వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్ ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు. సునీత పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం.. సునీత పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని పేర్కొంటూ.. అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దానిపై జులై 3వ తేదీన సీజేఐ ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. సుప్రీం నోటీసులపై అవినాష్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.
కాగా.. వైఎస్ వివేకా హత్యకేసులో అవినాష్ విచారణకు సహకరించడం లేదని గతంలో సీబీఐ కోర్టుకు తెలిపింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సమయంలో ప్రతి శనివారం సీబీఐ విచారణకు సహకరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సహకరించని నేపథ్యంలో సీబీఐ తదుపరి చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ఆ తర్వాత అవినాష్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారు. వివేకా హత్యకేసులో వైఎస్ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవగా.. ఇటీవలే బెయిల్ కు పిటిషన్ పెట్టుకున్నారు. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు తేల్చిచెప్పింది.