Taj Mahal Water Leak: తాజ్ మహల్ ప్రధాన గోపురం వద్ద లీక్ అవుతున్న నీళ్లు

తాము లీకేజీని తనిఖీ చేయడానికి డ్రోన్ కెమెరాలను ఉపయోగించామని

Update: 2024-09-14 07:51 GMT

ఆగ్రాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా తాజ్ మహల్ వద్ద నీరు లీకేజీ అయింది. ఇక తాజ్ మహల్ కు ఆనుకుని ఉన్న తోట దాదాపుగా నీటిలో మునిగిపోయింది. ప్రధాన గోపురంపై తేమను గమనించిన ఒక అధికారి ముందుగా హెయిర్‌లైన్ పగుళ్లను అనుమానించారు. దేశంలోని చారిత్రక కట్టడాలను చూసే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) లీకేజీపై ప్రస్తుతం ప్రత్యేక నిఘా ఉంచారు. 17వ శతాబ్దపు తాజ్ మహల్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటి.

ఆగ్రా సర్కిల్‌కు చెందిన సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్‌కుమార్ పటేల్ మాట్లాడుతూ.. తాము లీకేజీని తనిఖీ చేయడానికి డ్రోన్ కెమెరాలను ఉపయోగించామని చెప్పారు. తాజ్ మహల్ ప్రధాన గోపురంలో లీకేజీని చూశామని, కానీ మేము తనిఖీ చేసినప్పుడు, అది సీపేజ్ కారణంగా ఉందని గుర్తించామన్నారు. ప్రధాన గోపురంకు ఎటువంటి నష్టం జరగలేదని కనుగొన్నామని తెలిపారు. లీకేజీని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆగ్రాలో గురువారం 151 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 80 ఏళ్లలో 24 గంటల్లో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే. జాతీయ రహదారి జలమయం కాగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. ఆగ్రా అడ్మినిస్ట్రేషన్ అన్ని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. ఆగ్రాలోని ఇతర చారిత్రక ప్రదేశాలు ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ, జుంఝున్ కా కటోరా, రాంబాగ్, మెహతాబ్ బాగ్, చినీ కా రౌజా, సికంద్రాలోని అక్బర్ సమాధి, రోమన్ క్యాథలిక్ శ్మశానవాటిక కూడా భారీ వర్షం కారణంగా స్వల్పంగా దెబ్బతిన్నాయి.


Tags:    

Similar News