Tdp, Janasena Alliance : ఇంతకీ జనసేనకు వచ్చే సీట్లు అవేనా? అవే స్థానాలు అయితే?
టీడీపీ, జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. త్వరలోనే పోటీ పోయే స్థాానాలపై ప్రకటన ఉండే అవకాశముంది.
వైసీపీ నేతల్లో నిన్నటి వరకూ ఉన్న టెన్షన్ నేడు టీడీపీ, జనసేన నేతల్లో మొదలయింది. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వస్తుండటంతో తమ సీటు ఉంటుందా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న రెండు దఫాలు సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరి నేతల్లో సీట్ల సర్దుబాటు ఫైనల్ అయిందని చెబుతున్నారు. అధికారంలోకి వస్తే మంత్రి పదవులపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత లభిస్తుందని, ఐదు నుంచి ఆరు మంత్రి పదవులు జనసేనకు వచ్చేలా ఒప్పందం కుదిరిందన్న ప్రచారం జరుగుతుంది.
అలా అన్నప్పటికీ...
ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాము మూడో వంతు స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. అంటే దాదాపు యాభై నుంచి అరవై స్థానాల వరకూ పోటీ చేసే అవకాశముందని ఆయన పరోక్షంగా క్యాడర్ కు తెలిపారు. అయితే చంద్రబాబుతో జరిపిన చర్చల్లో మాత్రం అంతకంటే తక్కువ స్థానాలకే పవన్ అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇరవై ఐదు నుంచి ముప్ఫయి సీట్ల వరకూ ఇవ్వడం కుదురుతుందని చంద్రబాబు పవన్ తో అన్నట్లు తెలిసింది. అందుకు తగిన కారణాలను కూడా చంద్రబాబు పవన్ కు వివరించినట్లు చెబుతున్నారు. సమర్థమైన నాయకత్వంతో పాటు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని కూడా ఆయన ప్రస్తావించి పవన్ కల్యాణ్ కు సర్ది చెప్పడంలో సక్సెస్ అయ్యారంటున్నారు.
ఆ రెండు జిల్లాల్లో...
పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు వాదనను ఒకరకంగా సానుకూలంగా విని తమ వారితో చర్చించి ఎనిమిదో తేదీన జరిగే సమావేశంలో ఒక నిర్ణయానికి వద్దామని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు జనసేన కోరగా, ఆ స్థాయిలో సీట్లు ఇస్తే దశాబ్దాలుగా తమ పార్టీ కోసం పనిచేస్తున్న వారు ఇబ్బంది పడతారని, గత నాలుగేళ్లుగా తన వెంట నడుస్తూ పార్టీ కోసం శ్రమించిన వారిని పక్కన పెట్టడం సబబు కాదని కూడా చంద్రబాబు అన్నట్లు తెలిసింది. గెలిచే స్థానాలు తీసుకుని ఆ తర్వాత ప్రభుత్వంలో భాగస్వామిగా మారి, కీలక నిర్ణయాలలో ఇద్దరం నిర్ణయం తీసుకుందామని, జగన్ ను ఓడించగలగాలంటే సర్దుకోవాలని పవన్ కు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.
సీట్ల సంఖ్యపై...
మంత్రి పదవులు ముఖ్యం కాదని, పాలనలో భాగస్వామ్యం ముఖ్యమని ఈ సందర్భంగా పవన్ అన్నట్లు తెలిసింది. దీంతో పాటు సీట్ల సంఖ్య విషయంలోనూ తనకున్న.. తనకు ఎదురుకానున్న ఇబ్బందులు కూడా పవన్ వివరించినట్లు చెబుతున్నారు. బీజేపీ తమ కూటమిలో కలవకుంటే ఆ పార్టీకి ఇచ్చే స్థానాలను తమకు కూడా ఇస్తే బాగుంటుందన్న సూచనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఇరువురు నేతల మధ్య చర్చలు సానుకూల వాతావరణంలోనే జరగడంతో సంఖ్య విషయంలో పవన్ కూడా పెద్దగా పట్టుబట్టపోరని, చంద్రబాబు సీనియర్లకు అన్యాయం చేయరన్న నమ్మకం ఉన్నప్పటికీ ఉభయ గోదావరి జిల్లా నేతలకు మాత్రం టెన్షన్ తప్పడం లేదు. మరి కొద్ది రోజుల్లోనే సీట్ల పంపకాలపై స్పష్టత రానుంది.