బీటలు వారుతున్నాయి

బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాక ఆ పార్టీ క్యాడర్ లో చీలికలు స్పష్టంగా కనిపించాయి. ఓ వైపు వ్యక్తి భజనకు తావు..

Update: 2023-07-23 05:59 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ఎదుగుతున్న వైనం చూస్తే వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లానే కనిపిస్తున్నాయి పరిస్థితులు. కన్నడనాట ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అనూహ్యంగా బలం పుంజుకుంది. కాంగ్రెస్ ధాటికి బీఆర్ఎస్, బీజేపీలు కుదేలయ్యాయి. రేవంత్ రెడ్డి తో పాటు ఉత్తమ్, భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఒక్కసారిగా ఫుల్ ఆక్టివ్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణలో గత వైభవం వచ్చినట్టే కనిపించింది. పొంగులేటి, జూపల్లి లు ఏ పార్టీ లో చెరతారో అని నెలల కాలంగా గడిచిన సస్పెన్స్ కు కూడా కాంగ్రెస్ తెరదించింది. ప్రభంజనం లాంటి చేరికతో పొంగులేటి కాంగ్రెస్ పార్టీ లో కొత్త జోష్ నే నింపారు. ఆ తర్వాత వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్న సంకేతాలు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి తటస్థించింది. అప్పటివరకు ప్రతిపక్ష పార్టీ తామే అని అనుకున్న బీజేపీ మూడో స్థానానికి దిగిపోయింది. వచ్చే ఎన్నికల రేస్ లో బిజేపి అసలు నిలదొక్కుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

అందుకు కారణం కూడా లేకపోలేదు. కర్ణాటక ఎన్నికల తర్వాత అక్కడ బీజేపీ ఓడిపోవడంతో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. ఆ లిస్ట్ లో తెలంగాణ కూడా ఉంది. అప్పటికే పార్టీ లో అంతర్గత కుమ్ములాటలతో ప్రణాళికా లోపాలతో సాగుతున్న బిజేపి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. పార్టీ నేతలు, పార్టీ క్యాడర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఎన్నడూ లేని నిశ్యబ్దానికి లోనయ్యారు. ఓ విధంగా చూస్తే తెలంగాణ బిజేపి శ్మశాన వైరాగ్యానికి లోనైందా అని కూడా అనిపించింది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడం ఎలా అనుకున్న పార్టీ పెద్దలకి అంతర్గతంగా నెలకొన్న కోట్లాటలకు చెక్ పెట్టాలన్న ఆలోచన కలిగింది. తరచూ ఢిల్లీ వేదికగా జరుగుతున్న కంప్లైంట్ ల పర్వానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది.

అదే.. బండి సంజయ్

గత రెండేళ్ల కాలంగా తెలంగాణ మాజీ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ పై సొంత పార్టీ అభ్యర్థుల నుంచి ఎన్నో ఆరోపణలు వచ్చాయి. నియంత నిర్ణయాలు, పార్టీ పెద్దలకు గౌరవం ఇవ్వకపోవడం, ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం, బీఆర్ఎస్ పార్టీ కి ఏజెంట్ లా వ్యవహరిస్తున్నాడు అంటూ పదే పదే అతనిపై ఆరోపణలు రేగాయి. బండి సంజయ్ మాత్రం వాటిని ఖాతరు చేయకుండా తన పనిని తాను చేసుకుంటూ పోయాడు. అతను చేస్తున్న పనులు పార్టీ కి ప్లస్సే అవుతున్నాయి కాబట్టి ఇతరుల కంప్లయింట్ లను బేఖాతరు చేస్తూ వచ్చారు ఢిల్లీ పెద్దలు. కానీ.. గత నెల రోజుల్లో జరిగిన పరిణామాలు, పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్ ను చూసి ఒక్కసారిగా నిద్రలేచారు బీజేపీ పెద్దలు. కొట్లాటలతో కొనసాగితే రేస్ లో కాదు కదా.. కనీసం పది స్థానాలు కూడా గెలుస్తామో లేదో అన్న అంచనాలకు వచ్చారు పెద్దలు. వెను వెంటనే.. తెలంగాణ లీడర్లు కోరుకున్న విధంగా మార్పులు చేర్పులకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ముందు అధ్యక్షుడిని మార్చారు.
బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాక ఆ పార్టీ క్యాడర్ లో చీలికలు స్పష్టంగా కనిపించాయి. ఓ వైపు వ్యక్తి భజనకు తావు లేని పార్టీ గా చెప్పుకునే బీజేపీలో బండి సంజయ్ మార్క్ పాలిటిక్స్ కనిపించాయి. అతని నుంచే పార్టీకి లోభం కలిగింది అంటూ బండి క్యాడర్ విపరీతమైన ట్రోల్స్ చేసింది. దాంతో బండి పై విపరీతమైన సింపతీ ఏర్పడింది. రెండు రోజుల క్రితం జరిగిన అధ్యక్ష పదవి స్వీకార కార్యక్రమం లో బండి సంజయ్ బాహాటంగానే తన ఆవేదనని వెలిబుచ్చాడు. అంతే కాకుండా ప్రోగ్రామ్ మధ్యలోనే వెళ్ళిపోయాడు కూడా అని తెలిసింది. తెలంగాణ బీజేపీ సర్కల్స్ లో కొన్నాళ్ళ పాటు ఈ బండి వేవ్ కొనసాగేలా కనిపిస్తోంది. ఎన్నికల వరకు ఈ చీలికలు కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుందని అనడంలో సందేహం లేదు. ఒక్క బండి సంజయ్ నే కాదు.. బీజేపీ సీనియర్ లీడర్ విజయశాంతి కూడా మొన్న కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు.
ఈటెల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు అప్పజెప్పడం, పార్టీ లో దశాబ్దాల కాలంగా ఉన్న తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అదే వేదికపై ఉండటం ఇలా రకరకాల కారణాలు చెప్పి విజయశాంతి వెళ్ళిపోవడం వంటి ఘటనలు జరిగాయి. బండి, విజయశాంతిలు తమ అసంతృప్తిపై బయటపడ్డారు కానీ.. బండి ని తప్పించినందుకు నిరుత్సాహంలో ఉన్న మరికొందరు బయటపడలేకపోతున్నారు అని పార్టీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. అధ్యక్షుడు మారిన తర్వాత తమ పరిస్థితి ఏంటని పాత ఆశవహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్లందరినీ ఎవరు సమన్వయం చేసుకుంటూ పోతారు అనేది యక్షప్రశ్న. ఇప్పుడిప్పుడే చేరికల కమిటీ పగ్గాలు చేతికి వచ్చాయి కాబట్టి ఈటెల ఏం చేస్తారు? బండి వర్గం వల్ల పరిస్థితి ఏంటి? కిషన్ రెడ్డి, ఈటెలలు పార్టీ ని సమన్వయంగా ముందుకు తీసుకెళ్తారా? బీజేపీలో గేమ్ స్పిరిట్ తిరిగి నెలకొంటుందా? ప్రస్తుతం నెలకొన్న బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వంటి వాతావరణాన్ని బీజేపీ మార్చగలుగుతుందా? ఈ ప్రశ్నలకి రానున్న కాలం సమాధానం చెప్తుంది.


Tags:    

Similar News